అవకాశం వస్తే మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కొంతమంది క్యాబ్ డ్రైవర్లు. కారు ఎక్కినవారి ఊరు, పేరు, వివరాలు అడుగుతుంటారు, ముక్కూ మొహం తెలియకపోయినా వెంటనే సహాయం చేయమని అడుగుతారు. అంతవరకు బాగానే ఉన్నా.. కొంతమంది మగ డ్రైవర్లు, మహిళా ప్యాసింజర్ల పట్ల ప్రవర్తించే తీరు అప్పుడప్పుడూ వివాదాస్పదం అవుతోంది. తాజాగా అలానే ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికే దూరమయ్యాడు. 21 రోజులు సస్పెండ్ అయ్యాడు.
సువాసన ఎక్కడిది..
చైనాలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళా ప్రయాణికురాలు క్యాబ్ బుక్ చేసింది. అనుకున్న సమయానికే డ్రైవర్ క్యాబ్ తో సహా వచ్చాడు. అయితే ఆమె కారు ఎక్కిన తర్వాత అతని మాటతీరు కాస్త మారింది. మీ వంటి నుంచి వస్తున్న సువాసన మధురంగా ఉంది అని ప్రశంసించాడు డ్రైవర్. ఊహించని ఈ ప్రశంసకు ఆమె షాకైంది. అయితే వెంటనే తేరుకుని సున్నితంగా తిరస్కరించింది. మీరు మూడుసార్లు పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నారా అని అడిగాడు డ్రైవర్. అది అసలు పర్ఫ్యూమ్ కాదని, తనకు అలవాటు లేదని చెప్పిందామె. అతనింకా గుచ్చిగుచ్చి అడుగుతుండే సరికి అది బట్టలను ఉతికేందుకు వాడే డిజర్జెంట్ స్మెల్ అని అసలు విషయం చెప్పింది. అయితే ఆ డ్రైవర్ అక్కడితో ఆగలేదు. ఆ డిటర్జెంట్ పేరేంటి, ఏ కంపెనీ, ఏ బ్రాండ్ అంటూ ఆరాలు తీశాడు.
మహిళా ప్యాసింజర్ తో అనుచిత ప్రవర్తన..
డ్రైవర్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది మహిళా ప్యాసింజర్. అయితే కారు దిగిన వెంటనే సదరు క్యాబ్ సర్వీస్ కి కాల్ చేసి అసలు విషయం చెప్పింది. వెర్బల్ గా తనను ఆ డ్రైవర్ హెరాస్ చేశాడంటూ కంప్లయింట్ చేసింది. వెంటనే క్యాబ్ సర్వీస్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేసింది. క్యాబ్ లోని సీసీ కెమెరాల్లో వారిద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు, ఆమె ఇబ్బంది పడినట్టుగా గమనించింది. వెంటనే ఆ డ్రైవర్ ని మూడు వారాలపాటు సస్పెండ్ చేసింది. ఈ సంఘటనను స్థానిక జెజియాంగ్ టీవీ ప్రసారం చేసింది. అయితే క్యాబ్ డ్రైవర్ మాత్రం అందులో తన తప్పేమీ లేదంటున్నాడు. తాను అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పడం వల్లే సంభాషణ కొనసాగించానని, తప్పు ఉద్దేశంతో తాను ఆ ప్రశ్నలు అడగలేదని చెప్పాడు. కానీ కంపెనీ మాత్రం అతడి వివరణను వినలేదు. 21రోజులపాటు అతడిని విధులనుంచి సస్పెండ్ చేసింది.
ధైర్యంగా ఫిర్యాదు..
క్యాబ్ డ్రైవర్లు అందరూ ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తిసుంటారని అనుకోలేం. మహిళా ప్యాసింజర్లు ఉంటే చాలామంది ఓవర్ యాక్షన్లు చేస్తుంటారు. కొంతమంది మాటలతోనే వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. అలాంటి ఇబ్బందిని వెర్బల్ హెరాస్మెంట్ గా పరిగణిస్తుంటారు. అయితే బాధితులంతా ధైర్యంగా కంప్లయింట్ చేస్తారని అనుకోలేం. ఇక్కడ బాధితురాలు నేరుగా క్యాబ్ సర్వీస్ కంపెనీకి ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ ని వారు విధులనుంచి తొలగించారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి కంప్లయింట్స్ పై పోలీస్ కేసులు కూడా నమోదవుతుంటాయి. అయితే ఇక్కడ క్యాబ్ సర్వీస్ కంపెనీయే నేరుగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం విశేషం.