ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా చాలామంది ఆ సందర్భాన్ని ఆనందంగా జరుపుకున్నారు, మరికొంతమంది ఆయన రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడినట్టేనని వ్యాఖ్యానించారు. మోదీ రిటైర్మెంట్ వార్తలపై ఆ పార్టీ నేతలు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. అయితే ఆయన మోదీ రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అప్పటి వరకు ఆయనే..
బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారికి వాలంట్రీ రిటైర్మెంట్ ఇస్తున్నారు కదా, మరి మోదీ రిటైర్మెంట్ ఎప్పుడంటూ ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు రాజ్ నాథ్ సింగ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి మోదీయేని తేల్చి చెప్పారాయన. 2029, 2034, 2039, ఆపై 2044లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా మోదీయే ప్రధాని అభ్యర్థి అని స్పష్టం చేశారు. 2047లో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించిన తర్వాతే ఆయన పదవీ విరమణ తీసుకుంటారని చెప్పారు. అంటే మోదీకి రిటైర్మెంట్ నియమం వర్తించదని రాజ్ నాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చారనమాట.
రూల్ ఈజ్ నాట్ ఫర్ ఆల్..
2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ఓ వర్గం అద్వానీ ప్రధాని కావాలని కోరుకుంది. కానీ మోదీ వర్గం మాత్రం అడ్డుపుల్ల వేసింది. అసలు అద్వానీకి ప్రధాని పదవే కాదు, ఇతర మంత్రి పదవి కూడా దక్కకుండా చేసింది. 75 ఏళ్లు పైబడిన నాయకులు రాజకీయాలనుంచి రిటైర్ కావాల్సిందేనని వారు తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఇదే వాదన వినిపించేలా చేశారు. దీంతో బీజేపీలో 75 ఏళ్లు పైబడిన చాలామంది అన్యమనస్కంగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.
మోదీ సంగతేంటి?
మోదీ కూడా ఒక సగటు రాజకీయ నాయకుడే. కానీ ఇప్పుడు బీజేపీలో ఆయన టైమ్ నడుస్తోంది. అందుకే ఆయన రిటైర్మెంట్ గురించి కామెంట్ చేయడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. మోదీని కాదని ఇంకెవరి పేరూ చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. ఒకవేళ యోగి లాంటి వారి పేర్లు సూచించినా అందరూ ఆమోదిస్తారని అనుకోలేం. అందుకే మోదీకి ఆల్టర్నేట్ లేదని తేలిపోయింది. 75 ఏళ్లు పైబడినా మోదీ అందుకే పార్టీపై పెత్తం చలాయిస్తున్నారు. వయసు క్రైటీరియా కాకపోయినా, మోదీ తనకు తాను రిటైర్ అవుతాననే వరకు ఆయనకు ప్రత్యామ్నాయం వెదకాల్సిన అవసరం రాకపోవచ్చు.
వరుసగా మూడుసార్లు మోదీ ప్రధాన మంత్రి అయ్యారు. 2029 ఎన్నికలనాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఎన్నికల నాటికి బీజేపీకి విజయావకాశాలు ఉంటే మోదీ హంగామా కొనసాగుతుంది. ఒకవేళ మోదీ ఫేస్ తో ఎన్నికలకు వెళ్లి బీజేపీ బొక్కబోర్లా పడితే మాత్రం ఆయన స్థానంలో మరొకరు తెరపైకి వస్తారు. అయితే ప్రస్తుతానికి మోదీ స్థానానికి ఎసరు పెట్టాలనే ఆలోచన ఎవరికీ లేదనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా కూడా తమ ఉనికికి ప్రమాదం లేకుండా వారంతా సైలెంట్ గా ఉన్నారు.