TTD VIP Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ, ముందుగానే దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేకపోయారా? అయినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకని భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా ఫ్రీగా లేదంటే, స్పెషల్ ఫీజు చెల్లించి తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందవచ్చు. ఎలాగంటే..
త్వరగా శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు శ్రీవాణి ట్రస్ట్ బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం రూ.10,000 విరాళం, రూ.500 దర్శనం టికెట్ కలిపి మొత్తం రూ.10,500 చెల్లించాల్సి ఉంటుంది. టీటీడీ వెబ్‌సైట్ లేదంటే యాప్ ద్వారా అందుబాటులో ఉండే కోటాలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్ దొరకకపోతే తిరుమలలోని జేఈఓ కార్యాలయం దగ్గర ఆఫ్‌లైన్ కోటా గురించి తెలుసుకోవచ్చు. తిరుపతి విమానాశ్రయంలో కూడా ప్రత్యేక కౌంటర్ ద్వారా టికెట్లు పొందే అవకాశం ఉంటుంది.
డబ్బులు ఖర్చు చేయకుండా త్వరగా దర్శనం చేసుకోవాలనుకునే వారికి స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు ఉపయోగపడతాయి. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో వీటిని జారీ చేస్తారు. ఆధార్ కార్డు చూపించి టోకెన్ తీసుకోవచ్చు. ఇందులో దర్శనానికి సంబంధించిన రిపోర్టింగ్ టైమ్ కేటాయిస్తారు. ఆ సమయంలో క్యూలో చేరితే సాధారణ సర్వదర్శనంతో పోలిస్తే వెయిటింగ్ తగ్గే అవకాశం ఉంటుంది.
అలిపిరి మెట్టు లేదంటే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి తిరుమలకు చేరుకునే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. నడక ప్రారంభించే ప్రాంతాల్లో ఆధార్ కార్డు చూపించి ఈ టోకెన్లు పొందవచ్చు. మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద టోకెన్ స్కాన్ చేయించుకోవాలి. నిబంధనలు పాటించిన వారికి ప్రత్యేక దర్శన క్యూ సదుపాయం ఉంటుంది.
65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఏడాది లోపు చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శన సదుపాయాలు ఉన్నాయి. వీరికి సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పిస్తారు. డిఫెన్స్ సిబ్బందికి కూడా ప్రత్యేక నిబంధనల ప్రకారం దర్శన సదుపాయం ఉంటుంది. ఇందుకోసం సంబంధిత గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యే లేదంటే ఎంపీ సిఫార్సు లేఖల ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం లేదంటే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ లేఖలను ముందుగానే సమర్పించాలి. వీకెండ్స్, పండుగలు, రద్దీ సమయాల్లో వీటిని స్వీకరించకపోవచ్చు.
Read Also: ఫోటోలు దిగుదామని గుహలోకి వెళ్లింది.. చివరకు అక్కడే ఇరుక్కుపోయింది!