Meta vs Congress: దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని మెటా (Meta) కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ అయిన మెటా.. రాజకీయ భావప్రకటనను అణచివేసే సాధనంగా మారిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం అధిపతి మను జైన్.. మెటా ప్లాట్‌ఫామ్స్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ పేరు, ఫొటోలను కీవర్డ్స్‌గా వాడి పోస్టులను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పిటిషన్‌లో ఆరోపించింది. ఇది విపక్ష పార్టీకి ఉన్న ప్రజాస్వామ్య హక్కుకు విఘాతం కలిగించినట్లే అవుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
మరోవైపు కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించడానికి ఒకరోజు ముందు మెటా ప్రతినిధులు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనేత్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో తాము కేవలం భారతీయ చట్టాలను మాత్రమే అనుసరిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల మేరకే చర్యలు తీసుకుంటున్నామని మెటా అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే మెటా అనుసరిస్తున్న తీరు.. ప్రతిపక్షాల పట్ల వివక్షాపూరితంగా ఉందని ఇది భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడమే అవుతుందని సుప్రియా శ్రీనేత్ వారి వద్ద వాదించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Also Read: అమితాబ్ ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు.. మెట్రో స్టేషన్లకూ హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్!
మరోవైపు గురువారం కూడా సుప్రియా శ్రీనేత్ మాట్లాడుతూ మెటా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘మెటా అయినా మరే ఇతర సోషల్ మీడియా సంస్థ అయినా.. ఇవి అమెరికన్ ప్లాట్‌ఫారమ్‌లు. కేవలం ప్రతిపక్షాల కంటెంట్, ఖాతాలపైనే ఆంక్షలు విధిస్తే భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడమే. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. బీజేపీ రూపొందించిన ఏఐ కంటెంట్‌ను అనుమతిస్తూ, మా ఏఐ కంటెంట్‌ను తొలగించడం స్పష్టమైన పక్షపాతానికి నిదర్శనం’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read: మద్దిమడుగు సభలో.. లంబాడీలకు సీఎం రేవంత్ సంచలన హామీలు!