Siddaramaiah News Today(Telugu breaking news) : కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ సిద్దరామయ్యను ఆహ్వానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడర్‌గా సిద్ధరామయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు సిద్ధరామయ్య. ఆయనతోపాటు కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ కూడా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సిద్ధరామయ్యను గవర్నర్ ఆహ్వానించారు.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కర్ణాటక కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీఎం ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. 4 రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ను ప్రకటించింది. కేబినెట్ కూర్పుపైనా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది. శనివారం కొందరు మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది.