Gurugram: కంపెనీలోని పని విషయంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం కాస్త ముదిరింది. చివరకు మహిళా ఉద్యోగి.. తోటి ఉద్యోగి చెంప చెళ్లు మనిపించింది. ఆగ్రహానికి గురైన యువకుడు.. యువతి గొంతులో కత్తెర్లు దింపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెంది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. 25 ఏళ్ల శివాని.. గురుగ్రామ్‌లోని సెక్టార్ 37లోని ఒక పీజీ హాస్టల్‌లో నివాసం ఉంటోంది. ఈమె సొంతూరు యూపీలోని కన్నౌజ్ జిల్లా జలాల్‌పూర్ గ్రామానికి చెందినది. ఆ యువతి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఎన్‌డిఆర్ కంపెనీలో పని చేస్తోంది. ఈ కంపెనీ కార్ల సీట్ కవర్లను తయారు చేస్తుంది. నెలన్నర కిందట జూలై 13న ఆ కంపెనీలో చేరింది శివానీ. అదే కంపెనీలో 35 ఏళ్ల అస్లాం అనే యువకుడు పని చేస్తున్నాడు. వీడి సొంతూరు బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా చౌలాహా బంజరియాలోని సింధియా సాగర్‌కు చెందినవాడు.
శనివారం రాత్రి కంపెనీలో పని చేస్తుండగా షీట్-కవర్ కటింగ్ విషయంలో శివాని-సహోద్యోగి అస్లాంతో వాగ్వాదానికి దిగింది. అది కాస్త ముదిరిపోవడంతో పట్టరాని కోపంతో శివాని.. అస్లాంను చెంప దెబ్బ కొట్టింది. ఆగ్రహానికి గురైన అస్లాం, చేతి కందిన రెండు కత్తెర్లను ఆమె గొంతులోకి దింపాడు. ఘటన తర్వాత అక్కడున్నవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శివానీని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించింది.
సెక్టార్-37 పోలీసులు నిందితుడు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను తెలుసుకునేందుకు కంపెనీలోని ఇతర ఉద్యోగులను విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.