Delhi Building:దేశ రాజధానిలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.ఇక భారీ వర్షాల కారణంగా ఓ మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిందని తెలుస్తుంది.దక్షిణ-పశ్చిమ ఢిల్లీలోని సత్య నికేతన్, మోతీ బాగ్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని సమాచారం.
నానక్పురా గురుద్వారా, శివాలయం సమీపంలోని భవనం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిన సమయంలో అందులో పలువురు ఉన్నట్లు సమాచారం రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది.
సమాచారం అందిన కొద్ది సమయంలోనే
ఇక స్థానికుల సమాచారం ప్రకారం.. సత్య నికేతన్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మూడంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది.
వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందిన కొద్ది సమయంలోనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది, స్థానిక పోలీసులు, క్యాట్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు.
భవనం కూలిన ప్రదేశానికి దాదాపు 8 నుంచి 12 వరకు అగ్నిమాపక శకటాలు చేరుకున్నట్లు సమాచారం. శిథిలాల మధ్య ఎవరైనా చిక్కుకుపోయారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో రంగంలోకి దిగారు.
శిథిలాల కింద కొందరు విద్యార్థులు
ఇక పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా రంగంలోకి దించారు. ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ లోపల ఉన్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ భవనంలో బాయ్స్ హాస్టల్ లేదా పీజీ తరహా వసతి కొనసాగుతున్నట్లు ప్రాథమిక సమాచారం. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలో సత్య నికేతన్ ప్రాంతం ఉండటంతో ఇక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పీజీలు, హాస్టళ్లలో ఉంటుంటారు. దీంతో కూలిన భవనంలో కూడా విద్యార్థులు ఉన్నారన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి.
ఇక శిథిలాల కింద కొందరు విద్యార్థులు చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇక ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటికే ఇద్దరిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వారి పరిస్థితిపై పూర్తి వివరాలు వెంటనే వెల్లడించలేదు.
భవనం నిర్మాణంలో ఏదైనా లోపం ఉందా?
మరోవైపు భవనం లోపల చిక్కుకున్న కొందరు తమ మొబైల్ ఫోన్ల ద్వారా బయట ఉన్నవారిని, అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో రెస్క్యూ సిబ్బంది ఫోన్ సిగ్నల్స్, లోపల నుంచి వస్తున్న శబ్దాలను ఆధారంగా చేసుకుని శోధన కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
భవనం కూలిపోవడానికి ఢిల్లీలో గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే అసలు కారణమా, లేక భవనం నిర్మాణంలో ఏదైనా లోపం ఉందా అనే విషయంపై అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నట్టు తెలుస్తుంది.
వర్షాల కారణంగా భవనం నిర్మాణం బలహీనపడిందా అన్న కోణంలోనూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ప్రస్తుతం అసలు భవనంలో ఎంతమంది ఉన్నారు? వారిలో ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు? ఇంకా ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also read :బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!
ఇక భవనం ఒక్కసారిగా కూలి పోవడంతో సత్య నికేతన్ ప్రాంతంలో ఉంటున్న విద్యార్థులు, స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఇతర అత్యవసర సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.