Aravali Hills Mining Issue: దేశంలోని అత్యంత ప్రాచీన పర్వత శ్రేణుల్లో ఒకటైన.. ఆరావలి పర్వతాల రక్షణపై సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఆరావలి ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించింది. మైనింగ్ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోందన్న నివేదికలు వెలుగులోకి రావడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సుమోటో పిటిషన్‌ను డిసెంబర్ 29న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ విచారణను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ నిర్వహించనుంది. ఈ బెంచ్‌లో జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ ఏ.జీ మసీహ్ సభ్యులుగా ఉన్నారు. ఆరావలి పర్వతాల్లో మైనింగ్ వల్ల తలెత్తే దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలపై.. న్యాయస్థానం సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆరావలి పర్వతాల్లో మైనింగ్ కార్యకలాపాలపై కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ వల్ల అడవులు నాశనం కావడం, భూగర్భ జలాల తగ్గుదల, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యానికి ముప్పు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆరావలి పర్వతాల్లో మైనింగ్ తవ్వకాలపై నిషేధం విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ నుండి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న మొత్తం ఆరావలి పర్వత శ్రేణిని.. అక్రమ మైనింగ్ నుంచి కాపాడే దిశగా కేంద్రం స్పష్టమైన అడుగులు వేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరావలి ప్రాంతంలో ఏ విధమైన కొత్త మైనింగ్ లీజుల మంజూరుపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
ఈ నిషేధం ఆరావలి పర్వత శ్రేణి మొత్తం భూభాగానికి ఒకే విధంగా వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గుజరాత్ నుంచి జాతీయ రాజధాని ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిరంతర భౌగోళిక శిఖరంగా ఆరావలిని రక్షించడమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యమని కేంద్రం పేర్కొంది. పర్వత శ్రేణి యొక్క సమగ్రతను కాపాడటం, ప్రకృతి వనరులను సంరక్షించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించింది.
కేంద్ర ఆదేశాల ప్రకారం, ఇప్పటికే ఉన్న క్రమబద్ధీకరించని మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాల్సిందిగా.. రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి. పర్యావరణ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే మైనింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
Also Read: పాత ఫొటో షేర్ చేసి.. మోదీని కొనియాడిన దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్‌లో ప్రకంపనలు
ఆరావలి పర్వతాలు ఉత్తర భారతదేశంలో వాతావరణ సమతుల్యతకు.. కీలక పాత్ర పోషిస్తున్నాయని పర్యావరణ నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. ఎడారుల విస్తరణను అడ్డుకోవడం, భూగర్భ జలాలను నిలుపుకోవడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వంటి అనేక కీలక పనులు ఆరావలి పర్వతాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి కీలక పర్వత శ్రేణిలో అక్రమ మైనింగ్ కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.