Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ వార్త ప్రస్తుతం జోరుగా ప్రచారమవుతోంది. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోగి మరణిస్తే సదరు బిల్లు మొత్తాన్ని పూర్తిగా రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ.. ఈ ఆలోచన ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలపై ఆర్థిక భారం పడకూడదన్న కోణం ఇందులో దాగున్నప్పటికీ.. దీనివల్ల వైద్య రంగంలో తలెత్తే దుష్పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఒక ఆస్పత్రిని నడపాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రైవేటు ఆస్పత్రులు.. తమ నిర్వహణకు అయ్యే ఖర్చులను రోగి ఫ్యామిలీ నుంచే వసూలు చేస్తుంటాయి. ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, నిపుణులైన వైద్యుల జీతాలు, అత్యవసర మందుల ఖర్చులు అన్నీ రోగుల నుంచి వచ్చే ఫీజులపైనే ఆధారపడి ఉంటాయి. రోగి బతికితేనే డబ్బులు ఇస్తామనే నిబంధన పెడితే.. ప్రతి క్రిటికల్ కేసును జాయిన్ చేసుకోవడానికి ఆస్పత్రులు వెనుకాడే అవకాశముంది. ఒకవేళ రోగి మరణిస్తే అతడి కోసం పెట్టిన వైద్య ఖర్చు వృథా అయ్యి.. ఆస్పత్రులకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది.
ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు ఈ నిబంధన అమల్లోకి వస్తే.. ఆసుపత్రులు క్రిటికల్ కేసులను అడ్మిట్ చేసుకోకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. బతికే అవకాశాలు తక్కువగా ఉన్న అత్యవసర రోగులను చేర్చుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారంతా ఒక్కసారిగా ప్రభుత్వ ఆస్పత్రులకు పోటేత్తే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పెద్దగా అభివృద్ధికి నోచుకోని ప్రభుత్వ ఆస్పత్రులు.. అలాంటి క్రిటికల్ కండీషన్ ఉన్న పేషెంట్ కు నాణ్యమైన చికిత్స అందించగలవా? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.
ప్రస్తుతం వైద్యులు రోగి ప్రాణాలను కాపాడటమే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. కానీ ఈ నిబంధన వస్తే.. రోగి మరణిస్తే ఆస్పత్రికి ఒక్క రూపాయి కూడా రాదనే ఒత్తిడి వైద్యులపై పడుతుంది. దీనివల్ల చికిత్సలో వైద్యపరమైన నిర్ణయాల కంటే ఆర్థిక లాభనష్టాల ఆలోచనలే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా రోగి బతికే అవకాశం లేకపోయినా బిల్లును కాపాడుకోవడం కోసం అనవసరంగా, బలవంతంగా చికిత్సను పొడిగించే దుస్థితి తలెత్తవచ్చు.
Also Read: వీఐ ధమాకా ప్లాన్.. 3,500 GB డేటా, 20+ OTTలు ఫ్రీ.. మూవీ లవర్స్‌కు పండగే!
అయితే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు.. చికిత్స పేరుతో రోగి కుటుంబాన్ని పీల్చి పిప్పి చేస్తోందన్న వాదనల్లో ఏంతో కొంత నిజం లేకపోలేదు. బిల్లు కడితేనే పేషెంట్ బాడీని ఇస్తామని ఆస్పత్రులు చెబుతున్న అమానవీయ ఘటనలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి చెక్ పెట్టేందుకు కొన్ని పరిష్కార మార్గాలను వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. మెడికల్ ఖర్చులపై స్పష్టమైన, ఐటెమైజ్డ్ బిల్లింగ్ విధానాన్ని తీసుకురావాలని సూచిస్తున్నారు. నిర్దిష్ట శస్త్రచికిత్సలు, పరీక్షలు, మందులపై గరిష్ట ధరల పరిమితిని విధించాలని సూచిస్తున్నారు. మరోవైపు అత్యవసర సమయాల్లో ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడకుండా ప్రభుత్వ వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని హితవు పలుకుతున్నారు.
Also Read: సింగరేణిని ‘ATM’లా వాడి.. రూ.50 వేల కోట్ల బాకీ పెట్టారు.. కాంగ్రెస్, BRSలపై కిషన్ రెడ్డి ఫైర్!