Crop Damage By Snail: ఆఫ్రికన్ రాక్షస నత్తలు.. ఈ పేరు చెబితే చాలు రైతులు వణికిపోతున్నారు. అదేంటి.. నత్తలే కదా.. ఏం చేస్తాయిలే అనుకుంటున్నారా.. ఒక్క క్షణం ఆగండి.. వాటి గురించి చూడండి.. అప్పుడు మీకే తెలుస్తుంది రైతులు ఎందుకు వాటి పేరు చెబితే బెంబేలెత్తుతున్నారు అన్నది. అసలే భారీ వర్షాలతో సగం పంట నీటిపాలు కాగా.. ఈ ఆఫ్రికన్ నత్తల పుణ్యమాని కూరగాయల పంటలు పూర్తిగా నాశనమైపోతున్నాయి. ఏదో ఒకటి రెండు నత్తలైతే.. కర్షకులే ఏరి పారేస్తారు.. కాని లక్షల్లో వచ్చిన నత్తలను పంట పొలాల నుంచి తరమలేక దిగాలు పడిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో రైతులకు దడ పుట్టిస్తున్న ఆఫ్రికన్ నత్తలపై బిగ్ టీవి గ్రౌండ్ రిపోర్ట్.
చేతి కొచ్చిన పంటను నాశనం చేసిన రాక్షస నత్తలు..
ఒకటీ రెండు కాదు.. లక్షల్లో రాక్షస నత్తలు. అందులోనూ ఆఫ్రికన్ నత్తలు ఒకవైపు .. సొల్లు నత్తలు మరోవైపు. గడ్డమణుగు గ్రామంలో రైతు నాలుగున్నర ఎకరాల్లో వంగ తోట వేశాడు. పంట విరగ కాసింది. కొనుగోలు చేసేందుకు బయ్యర్ ముందుకొచ్చాడు. రైతుతో బేరం కూడా మాట్లాడుకున్నాడు. కాని ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు ఆఫ్రికన్ రాక్షస నత్తలు. వంగ తోట మొత్తం నాశనం చేసేశాయి. తోటలో ఉన్న ఆకుల నుంచి వంకాయల వరకు అంతా కొరికేసి ఎందుకూ పనికి రాకుండా భారీ నష్టాన్ని మిగిల్చాయి. అంతేనా.. సాయంత్రం ఆరు తర్వాత పొలంలోకి వచ్చే నత్తలు.. ఉదయం 7 గంటల వరకు పంటను నాశనం చేస్తాయి. ఆ తర్వాత వెళ్లిపోతాయి. ఇక, జంట నత్తలు ఒకేసారి 2 వేల గుడ్లను పెట్టడం కర్షకులకు శాపంలా మారుతోంది.
నత్తలతో లబోదిబోమంటున్న రైతులు..
రాక్షస నత్తలు ఒక రకమైతే.. సొల్లు నత్తలు మరో రకం. గడ్డమణుగు గ్రామంలోనే ఇంకో రైతు మిరప పంట వేశాడు. తనకున్న నాలుగు ఎకరాల్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు.. సొల్లు నత్తలు పంటపై ముప్పేట దాడి చేశాయి. మొదలుకు మొదలులోనే కాండం చర్మాన్ని తినేయడంతో కొద్ది రోజులకు మిరప చెట్టు పెరిగితే అవి ఒకవైపు వంగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో 10 క్వింటాళ్ళ మిరప వస్తే ప్రస్తుతం సొల్లు నత్తల విధ్వంసం వల్ల 3 నుంచి 4 క్వింటాళ్ళు మాత్రమే వస్తుందని లబోదిబోమంటున్నాడు.
నత్తలను చేతులతో పట్టుకోవద్దని అధికారులు హెచ్చరిక..
రాక్షస ఆఫ్రికన్ నత్తలు పంటలను ధ్వంసం చేస్తుండడంతో చేసేదేమీ లేక రైతులు కూరగాయలను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో.. గడ్డమణుగు గ్రామంలో రోడ్లపై ఎక్కడ చూసినా పాడైపోయిన కూరగాయలే కన్పిస్తాయి. మిగిలిన రైతులు నత్తలను ఏరివేసేందేకు ప్రత్యేకంగా కొంత మందిని పెట్టుకొని మరీ పంటను కాపాడుకుంటున్నారు. అధికారులు మాత్రం నత్తలను చేతితో పట్టుకోవద్దని.. గ్లౌజులు చేతికి తొడుక్కొని పట్టుకోవాలంటూ ఉచిత సలహాలిస్తున్నారని ఫైరవుతున్నారు.
రైతుల విధిగా నివారణ పద్ధతులు పాటించాలని సూచనలు..
గోదావరి జిల్లాలతో పోల్చితే ఈ ప్రాంతంలో నత్తల ఉధృతి చాలా తక్కువని జిల్లా ఉద్యాన అధికారి బాలాజీ చెబుతున్నారు. జి. కొండూరు మండలంలో 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారని, నత్తల బెడద తొలి దశలోనే ఉందన్నారు. అధిక వర్షాల వల్ల నత్తలు వ్యాప్తి చెంది రాత్రి పూట పంటలకు ఎక్కువ పంట నష్టం చేస్తుంటాయన్నారు. రైతులు విధిగా నివారణ పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.
Also Read: బాబు సరికొత్త విజనరీ.. ఏపీలో డ్రోన్ ట్యాక్సీలు..
మొత్తంగా మొన్నటి వరకు భారీ వర్షాలతో చతికిలపడిన రైతులు.. ఈ నత్తల దాడితో మరింత కుంగిపోతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.