Car Fire Accident: ఎన్‌టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా సమీపంలో ఓ కారు భీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు నియంత్రణ కోల్పోయి ముందుగా బైక్‌ను, అనంతరం రోడ్డుపక్కన వెళ్తున్న నీటి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగి, కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాహనం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు.. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు ప్రయాణం అవుతుండగా కీసర టోల్‌ప్లాజా సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారును అతివేగంగా నడపడం వల్ల డ్రైవర్ మలుపు వద్ద వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. టోల్‌ప్లాజా లెన్స్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం స్కిడ్ అయి ముందున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఆపై కారు పక్క లేన్లో వెళ్తున్న నీటి ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ శబ్ధం వినిపించింది. ఢీకొట్టిన వెంటనే కారులోని ఇంజిన్ భాగంలో స్పార్కులు ఏర్పడి, ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కారులో మంటలు చెలరేగడం ప్రారంభమైన వెంటనే.. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు తక్షణమే బయటకు దూకి ప్రాణాలు నిలబెట్టుకున్నారు.
సమీపంలోని టోల్‌ప్లాజా సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో, ఫైరింగ్ బృందం కొద్ది నిమిషాల్లోనే అక్కడికి చేరింది. అయితే అప్పటికే కారు మొత్తం మంటల్లో కాలిపోవడంతో వాహనాన్ని పూర్తిగా ఆర్పేయడానికి కొంత సమయం పట్టింది. బైక్ కూడా మంటల్లో భాగంగా దగ్ధమై తీవ్రంగా దెబ్బతింది. ట్యాంకర్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు మాత్రమే కాగా, అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also Read: తిరుమల ఘాట్‌లో కారు బోల్తా.. స్పాట్‌లో భక్తులు
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.