BigTV English

Places of Worship Act : ప్రార్థనా స్థలాల చట్టం-1991 నేపథ్యం ఇదీ..!

Places of Worship Act : ప్రార్థనా స్థలాల చట్టం-1991 నేపథ్యం ఇదీ..!
Places of Worship Act

Places of Worship Act : రామజన్మభూమి ఉద్యమం పేరుతో అద్వానీ రథయాత్ర, బీహార్‌లో అతని అరెస్టు, యూపీలో కరసేవకులపై జరిగిన కాల్పులు దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఆ సందర్భంలోనే వీహెచ్‌పీ-బీజేపీ వారణాసి, మథురలను కూడా విముక్తి చేస్తామని ప్రకటించేవారు. ‘అయోధ్య తో బస్‌ ఝాంకీ హై – కాశీ మథుర బాకీ హై’ (అయోధ్య ప్రివ్యూ మాత్రమే. ఇక కాశీ, మథుర మిగిలే ఉన్నాయి).


అనే వారి నినాదం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో ముందుముందు దేశంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు రాకుండా నిరోధించేలా నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991లో ‘ప్రార్థనా స్థలాల చట్టం’ పేరుతో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ నాటి హోంమంత్రి ఎస్‌బీ చవాన్‌.. ‘దేశంలో రోజుకో రూపం లో వివాదాలూ, మత ఉద్రిక్తతలు చెలరేగుతున్న స్థితిలో ఈ బిల్లును ఒక అనివార్య నివారణ చర్యగా ముందుకు తెస్తున్నాం. భవిష్యత్తులో పవిత్ర స్థలాల పేరుతో మరే ఇతర వివాదాలు సృష్టించకుండా ఈ బిల్లు నిలువరిస్తుంది’ అని అన్నారు.


అయితే.. నాటి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘ప్రార్థనా స్థలాలకు 1947 నాటి యథాతథస్థితిని కొనసాగించటమంటే కళ్లుమూసుకుని పావురం పిల్లికి ఎదురుగా పోవటం లాంటిదే’ అని బీజేపీ ఎంపీ ఉమాభారతి అన్నారు. ఈ చట్టంతో ‘ఈ ఉద్రిక్తతలను వచ్చేతరాలకు భద్రపర్చటమే’నని చెప్పారు. ‘చరిత్రలో తమ దుస్థితి ఏమిటో హిందువులు తెలుసుకోవాలని, అలాగే భవిష్యత్‌ తరాల ముస్లింలకు తమ శక్తిని, ఘనతను గుర్తు చేసేందుకే ఔరంగజేబు.. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి వాటి శిథిలాలను వదిలిపెట్టాడు’ అని ఉమాభారతి అన్నారు.

అది పార్లమెంటు ఆమోదం కూడా పొంది చట్టంగా మారింది. దానిని వ్యతిరేకిస్తూ.. కొందరు సుప్రీంకోర్టుకు పోగా.. ‘ఈ చట్టంతో రాజ్యం తన రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చింది. రాజ్యాంగపు మౌలిక లక్షణమైన లౌకికత్వాన్ని, సర్వమత సమభావనను దృఢపరుస్తూ రాజ్యాంగ బాధ్యతను ఆచరణలో పెట్టింది. రాజ్యాంగంలోని లౌకికత్వం పట్ల నిబద్ధతకు ఈ చట్టం ఒక మార్గదర్శిగానే గాక మన లౌకిక రాజకీయ వ్యవస్థను కాపాడటానికి ఇదొక శాసనపరమైన సాధనం. లౌకిక విలువల పరిరక్షణకు ఈ చట్టం ఒక శాసనపరమైన చొరవ’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఇక.. ఈ చట్టంలోని వివరాల్లోకి పోతే.. దీని ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉన్న ఏ ప్రార్థనా స్థలాన్ని మార్చకూడదు. ఆ ప్రార్థనా స్థలం మత స్వభావాన్ని కాపాడే ఏర్పాటును ప్రభుత్వం చేయాలి. ఏదైనా ప్రార్థనా స్థలాన్ని మరో మతానికి చెందిన స్థలంగా లేదా అదే మతంలోని మరో శాఖకు చెందిన స్థలంగా మార్చడాన్ని ఈ చట్టంలోని సెక్షన్‌-3 నిషేధిస్తున్నది.

1947 ఆగస్టు 15 నాటికి ఏదైనా మత స్థలం ఏ లక్షణాన్ని కలిగి ఉన్నదో అలాగే కొనసాగాలని ఈ చట్టంలోని సెక్షన్‌-4 (1) నిర్దేశిస్తున్నది. ప్రార్థనా స్థలాల మత లక్షణాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఏ కేసు అయినా, న్యాయ విచారణ అయినా 1947 ఆగస్టు 15 నాటికి పెండింగ్‌లో ఉంటే, దానిని పరిష్కరించాలనీ, కొత్త కేసులు వేయటం కుదరదని, వేసినా విచారించరాదని సెక్షన్‌-4 (2) నిర్దేశిస్తున్నది.

రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన కేసు 1947 ఆగస్టు 15కు ముందునుంచే కోర్టులో ఉన్నందున.. దానికి ఈ చట్టం వర్తించదని సెక్షన్‌- 5 నిర్దేశిస్తున్నది.

ఇదీ చదవండీ : జ్ఞానవాపి ఒక్కటే కాదు.. మరో 5 బావులున్నాయ్!

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×