Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సీఎంను మారుస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే సహా ఆయన వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. బీజేపీ అసలు వ్యూహం ఇదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 16 మంది శిండే వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగస్ట్ 11 లోగా నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో శిండేను తప్పించి అజిత్‌కు పగ్గాలు అప్పగించాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.
మహారాష్ట్రలో తాజా పరిణామాలపై ఉద్ధవ్ ఠాక్రే పత్రిక సామ్నా ప్రచురించిన సంపాదకీయం రాజకీయ అలజడి రేపింది. త్వరలోనే అజిత్ పవార్ సీఎం పీఠంపై కూర్చుంటారని ఆ పత్రిక పేర్కొంది. ఏడాది కిందట శివసేనను చీల్చి బయటకు వచ్చిన 16 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని తెలిపింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల నేతృత్వంలోని బీజేపీ దేశంలోని రాజకీయాలను బురదమయం చేసిందని విమర్శించింది.
సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ ఖండించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో అసలు తమకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడదని స్పష్టం చేసింది. ఒకవేళ వ్యతిరేక నిర్ణయం వచ్చినా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తేల్చి చెప్పింది.
మహారాష్ట్రలో ఉన్న 48 లోక్‌సభ సీట్లలో 45 గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ శిండే నాయకత్వంలో ఇలాంటి విజయం సాధ్యంకాదని కాషాయ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. మరాఠా నాయకుడిగా శిండే కంటే అజిత్ పవార్ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపగలరని నమ్ముతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాజ్‌భవన్‌కు సమర్పించిన లేఖ ప్రకారం అజిత్ పవార్‌కు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ అంటోంది. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 145 మంది మద్దతు అవసరం. ఆ బలం ఉందని బీజేపీ చెబుతోంది. అప్పుడు శిండే వర్గ ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదనే వాదన వినిపిస్తోంది.