Vijay Government: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి టీవీకే అధినేత విజయ్ తన మార్క్ నిర్ణయాలతో యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడుతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వ్యవస్థల్లో పాతుకుపోయిన అవినీతిని.. కూకటివేళ్లతో పెకలించేందుకు విజయ్ సినిమా స్టైల్లో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా.. ప్రజలకు అండగా నిలిచేలా సరికొత్త డెసీషన్ ను టీవీకే ప్రభుత్వం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటీ? దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది? వంటి విశేషాలు ఈ కథనంలో చూద్దాం.
ఈ రోజుల్లో ప్రభుత్వ ఆఫీసులో ఏ చిన్న పని కావాలన్నా లంచం ఇవ్వందే ఫైలు కదలని పరిస్థితి ఉందని సామాన్యులు చెబుతున్నారు. అయితే ఈ సంస్కృతికి స్వస్తి పలకాలని సీఎం విజయ్ గట్టిగా నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖలో ఏ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ఆయన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అధికారులు లంచం అడిగినట్లు పక్కా ఆధారాలు (ఆడియో, వీడియో రికార్డింగ్స్) సమర్పిస్తే.. పౌరులకు ఏకంగా రూ.1 లక్ష రివార్డు అందించేలా టీవీకే ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తమిళనాట స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.
ఈ సరికొత్త విధానంలో ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చేలా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు సైతం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లంచం అడిగే వారిని పట్టించే క్రమంలో ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచనున్నారు. వారికి ఎలాంటి ప్రాణహాని లేదా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన రక్షణ సైతం కల్పించేలా విజయ్ ప్రభుత్వం నిబంధనలు సిద్దం చేస్తోంది. అంతేకాకుండా లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారులపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా.. ఆరోపణల తీవ్రతను బట్టి ఉద్యోగం నుంచి తొలగించేలా కఠిన చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో విజయ్ ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.1000 లంచం డిమాండ్ చేసినా సరే.. సదరు అధికారిపై చర్యలు తీసుకొని ఫిర్యాదు దారుడికి రూ.1 లక్ష రివార్డు అందించేలా సీఎం విజయ్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడిన సీఎం విజయ్.. తమిళనాడు దాదాపు రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టే పన్నుల సొమ్ము పక్కదారి పట్టకుండా.. నేరుగా ప్రజా సంక్షేమానికి చేరాలంటే అవినీతి రహిత పాలన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ రూ. 1 లక్ష రివార్డు పథకం ద్వారా ప్రజలే స్వయంగా అవినీతి నిరోధక సైనికులుగా మారతారని.. తద్వారా ఖజానాకు జరిగే లూటీని అడ్డుకోవచ్చని విజయ్ ప్రభుత్వం నమ్ముతోంది.
Also Read: డబ్బులు ఎక్కువైతేనే Jio, Airtelకి వెళ్లండి.. లేదంటే ఈ చౌకైన BSNL ప్లాన్ బెస్ట్!
అవినీతి నిరూపిస్తే రూ.1 లక్ష రివార్డుపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. దీనిపై జరుగుతున్న ప్రచారానికే ప్రజలు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ‘ఇప్పటివరకు లంచం ఇవ్వలేక పనులు ఆగిపోయిన రోజులు చూశాం.. ఇప్పుడు లంచం అడిగితే రివార్డు వచ్చే రోజులు రాబోతుండటం ఆనందంగా ఉంది’ అంటూ తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. టీవీకే ప్రభుత్వం చేస్తున్న సరికొత్త ఆలోచనతో ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల గుండెల్లో ఇప్పటి నుంచే రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఎవరు ఎప్పుడు ఏ రూపంలో తమ అవినీతిని రికార్డు చేస్తారోననే భయం వారిలో మెుదలవుతుందని అంటున్నారు.
Also Read: దేశంలో ఫస్ట్ టైమ్.. Airtel నుంచి సరికొత్త 5G టెక్నాలజీ.. రూ. 449కే అదిరిపోయే బెనిఫిట్స్!