Hanging Glaciers: ఎల్‌నినో ప్రభావం భూమి అంతటా పడుతోంది. వర్షాలు ఏమోగానీ.. ఫలితంగా వందల ఏళ్లుగా గడ్డ కట్టిన హిమానీ నదాలు కరిగిపోయి ఆకస్మిక వరదలకు దారి తీస్తున్నాయి. గతవారం నేపాల్‌లో జరిగింది అదేనని చెబుతున్నారు నిపుణులు. నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, భారత్‌లో ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో హిమానీనదాలు, వాటి సరస్సుల పర్యవేక్షణను ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. నిటారుగా ఉండే ఎత్తైన లోయలలో ఉండే పెద్ద హిమానీనదాలు, మంచు శిఖరాలైన హ్యాంగింగ్ గ్లేసియర్‌లపై ఫోకస్ చేశారు శాస్తవేత్తలు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ మేగజైన్ ప్రచురించిన వాటిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్య హిమాలయాల్లోని అలకనంద బేసిన్‌లో 219 వేలాడే హిమానీ నదాలను గుర్తించినట్టు ఓ నివేదికలో తేలింది. వాటి వైశాల్యం సుమారు 71 చదరపు కిలోమీటర్లు. అందులో మంచు పరిమాణంలో సుమారు 30 శాతం ఎగువ అలకనంద బేసిన్‌లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీ నదాల కరిగిపోవడం మంచు ముక్కలు విరిగిపడుతున్నాయి. అయితే వేలాడే హిమానీ నదాలు ప్రమాదకరమైనవిగా చెబుతున్నారు నిపుణులు. వేలాడే హిమానీనదాల్లో ఒక భాగం విరిగిపోయిన మంచు.. రాళ్ళు, మంచు శిథిలాలు, బురద వేగంగా కొండ పైనుంచి కిందికి వస్తాయి. ఆ శిధిలాలు తమ మార్గంలో మరిన్నింటిని పోగుచేస్తూ వినాశకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
నేపాల్‌లో జరిగింది కూడా అదేనని అంటున్నారు. వాటిని నదులు అడ్డుకోగలవు కాకపోతే నీరు నిలిచిపోయి ఆకస్మిక వరదలకు కారణమవుతున్నాయి. హిమానీనదం విరిగిపోవడం వల్ల మంచు శిధిలాలు, కొండచరియలు విరిగిపడటం, నదులు మూసుకుపోవడం, వరదలతో సహా అనేక విపత్తులను ప్రేరేపించగలదని చెబుతున్నారు. దీని ద్వారా ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న ముప్పు తీవ్రతను అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో వేలాడే హిమానీనదాలు, శిథిల ప్రవాహాలపై అధ్యయనం చేస్తున్నారు పరిశోధకులు. బద్రీనాథ్ ప్రాంతంలో ఇలాంటి ప్రవాహాల గరిష్ట ఎత్తు 51 మీటర్లు ఉండవచ్చని ఓ అంచనా. ఆ ఎత్తు 15 నుండి 17 అంతస్తుల భవనానికి సమానం. మానా, బద్రీనాథ్, హనుమాన్ చట్టి, ఘంగారియా వంటి ప్రాంతాల్లో హిమానీ నదాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ అవి ఎప్పుడు విరిగిపోతాయో అంచనా వేయడం కష్టమని అంటున్నారు.
పర్వత లోయల్లో నిర్మాణాలు, జనాభా నిరంతరం పెరగడం వల్ల ఆ తరహా ప్రమాదం అధికమవుతున్నాయి. పరిశోధన ప్రకారం.. 2000- 2030 మధ్య ఈ విధంగా ప్రభావితమయ్యే ప్రాంతాల నిర్మాణాలు 8,025 చదరపు మీటర్ల నుండి 1,51,800 చదరపు మీటర్లకు పెరగవచ్చని ఓ అంచనా. అక్కడ నివసించే జనాభా 380 నుండి సుమారు 8,540కి పెరిగే అవకాశముంది. నేపాల్ విపత్తు వెనుక హిమానీనదం, అక్కడి జనాభా నదికి ఇరువైపులా ఇళ్లు కట్టుకోవడం వాటి పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. భారత్ అలాంటి ముప్పులను ఎదుర్కోవడానికి కేవలం హిమానీ నదాలను గుర్తించడం సరిపోదని చెబుతున్నారు నిపుణులు. వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెబుతున్నారు.
ALSO READ: ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు
హిమపాతం సమయాన్ని, ప్రదేశాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని, పర్యవేక్షణ, సన్నద్ధత ఉంటే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. అందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలతోపాటు సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఉండాలని నొక్కి చెబుతున్నారు. అంతేకాదు సున్నితమైన పర్వత ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించాలని తేల్చి చెబుతున్నారు. ఐదేళ్ల కిందట అంటే 2021 చమోలీ, గతేడాది స్విట్జర్లాండ్‌లోని బ్లాటెన్ వంటి విపత్తు సకాలంలో చర్యలు వల్ల ప్రాణాలను కాపాడగలవని నిరూపించాయి.