Supreme Court: ఆస్పత్రుల్లోకి వెళ్లి వైద్యులపై దాడులకు పాల్పడే వారి పట్ల ఎలాంటి ఉదారత చూపకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అటువంటి వారికి బెయిల్ పొందే అర్హతే లేదని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర థానే జిల్లాలో ఓ ఆస్పత్రికి వెళ్లి వైద్యులపై దాడి చేసిన శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రే కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
తన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంపై శివసేన కార్పొరేటర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. వైద్యులపై దాడిని తీవ్రంగా తప్పుబట్టింది. ‘ఆస్పత్రిలోకి వెళ్లి ఎవరిపై పడితే వారిపై దాడి చేస్తారా? వైద్యులపై భౌతిక దాడులకు పాల్పడే వారికి అసలు బెయిల్ రాకూడదు. వైద్య రంగం పట్ల వీరికి కనీస గౌరవం లేదు. గుంపుగా వచ్చి దాడి చేసినప్పుడు అక్కడ ఉండే వైద్యులు ఎదుర్కొనే మానసిక ఆందోళనను ఒక్కసారి ఊహించండి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మరోవైపు నిందితుడి తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. హైకోర్టు విధించిన బెయిల్ షరతులు అత్యంత కఠినంగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి 10 రోజుల గడువు విధించడంపై అభ్యంతరం తెలిపారు. మరోవైపు నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను పూర్తిగా రద్దు చేయాలని సవాలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతోందని ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ్ ధర్మాధికారి కోర్టుకు తెలిపారు. అటు మెడికల్ అసోసియేషన్ లాయర్ సైతం బెయిల్ ను తప్పుబట్టారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయబోయే పిటిషన్‌ను పరిశీలించిన తర్వాతే తదుపరి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
కళ్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ అయిన రమేష్ మాత్రేకు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు పలు షరతులు విధించింది. ఛార్జ్‌షీట్ దాఖలయ్యే వరకు మహారాష్ట్ర సరిహద్దుల్లోకి అడుగుపెట్టకూడదని గోవాలోని కలంగుట్ ప్రాంతంలో నివసించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా వారానికి 3 సార్లు అంజునా పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది. అయితే నిందితుడికి దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను నిలిపివేస్తూ బాంబే హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించడం సరైన చర్యేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
గతంలో విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజల రక్షణ కోసం పనిచేయాలని.. అలాంటి వ్యక్తే తన ఓటర్లపై లేదా వైద్యులపై దాడికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని గతంలో వ్యాఖ్యానించింది. దిగువ కోర్టు నిందితుడి నేర చరిత్రను చూడకుండా బెయిల్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది. అయితే విచారణ వేగంగా జరుగుతుండటం, నిందితుడు అప్పటికే కొద్దిరోజులు జైలులోనే ఉన్నందున కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతుల్లేని బెయిల్ కోసం నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
Also Read: పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!
జులై 6న థానేలోని శాస్త్రి నగర్ ఆస్పత్రిలో కార్పొరేటర్ రమేశ్ మాత్రే బీభత్సం సృష్టించారు. ఓ గర్భవతికి చికిత్స అందించడంలో వైద్యులు ఆలస్యం చేశారని ఆరోపిస్తూ తన అరుచులతో కలిసి డాక్టర్లపై దాడికి తెగబడ్డారు. మగ వైద్యుడిపై దాడి చేయడమే కాకుండా ఓ మహిళా డాక్టర్ పట్ల కార్పొరేటర్ దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై డాక్టర్ల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవ్వడంతో బాంబే హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.
DOCTORS, NURSES HALT ROUTINE SERVICES AT DOMBIVLI HOSPITAL AFTER SHIV SENA CORPORATOR ALLEGEDLY ASSAULTS STAFF
Routine services at KDMC-run Shastrinagar Hospital were suspended Tuesday after staff protested an alleged assault by Shiv Sena corporator Ramesh Mhatre on nurses, a… pic.twitter.com/W33j4Rme2v
— Nabila Jamal (@nabilajamal_) July 7, 2026
Also Read: నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!