Over Time Work Labour Code: మన దేశంలోని చాలా కంపెనీల్లో చూసే సాధారణ విషయం.. ఆఫీస్ టైమ్ ముగిసినా ఉద్యోగిని పనిచేయించడం. పెండింగ్ పనిని పూర్తి చేయాలని బాస్ ఆర్డర్ వేయడం, ఎక్స్ ట్రా వర్క్ ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కొన్ని సంస్థలు ఎక్స్ ట్రా టైమ్ పనిచేసిన కార్మికులు అదనపు వేతనాలు చెల్లిస్తుంటాయి. నిర్ణీత గంటల కంటే ఎక్కువ సమయం పనిచేయాలని ఆర్డర్స్ మౌఖికంగా వస్తాయి. ఉద్యోగి బాస్‌కు ‘నేను ఎక్కువ సమయం పనిచేయను’ అని చెప్పి ఇంటికి వెళ్లిపోవచ్చని కొందరు అనవచ్చు, కానీ అది చెప్పినంత సులభం కాదని ఉద్యోగులందరికీ తెలిసిన సంగతే. ఆ తర్వాత పరిస్థితులు, ఉద్యోగి కుటుంబం పోషణ, లోన్ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు ఉన్నప్పుడు ఉద్యోగి ఎక్కువ సమయం చేయలేనని బాస్ కు చెప్పలేడన్నది వాస్తవం.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ల రంగంలోని కంపెనీలలో ఉద్యోగులు సాధారణంగా ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. భారతీయ కార్పొరేట్ సంస్కృతిలో ఇది ఒక భాగంగా మారిందంటున్నారు. కానీ ఇది చట్టబద్ధం కాదని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో ఉద్యోగులను ఓవర్‌టైమ్ పనిచేయమని బలవంతం చేయలేరని, అందుకు నిబంధనలు ఒప్పుకోవని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఓవర్‌టైమ్ అనేది ఎప్పుడూ స్వచ్ఛందంగానే ఉండాలి, అందుకు యజమానులు నిర్దిష్ట అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకే ఓవర్ టైమ్ అనేది ఎప్పుడూ మౌఖికంగానే ఉంటుంది. అధికారికంగా కాగితాలపై ఉండదనేది వాస్తవం. రాతపూర్వకంగా ఓవర్ టైమ్ చేయమని చెబితేనే చట్టబద్ధంగా చెల్లుతుందని, మౌఖిక ఆదేశాలకు చట్టబద్ధత ఉండదనేది నిపుణులు చెబుతున్నారు.
ఓవర్ టైమ్ కు సంబంధించిన ఆదేశాలు వస్తే వెంటనే వాటిని రికార్డు చేసుకోవాలి. వాట్సాప్ సందేశాలు, ఇ-మెయిల్, ఇతర సూచనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను భద్రపరుచుకోవాలి. ఓవర్ టైమ్ ఆదేశాలు మౌఖికంగా ఉన్నప్పటికీ, వాటి తదుపరి వివరాలను ఇ-మెయిల్ ద్వారా ఒక లిఖితపూర్వక ఆధారంగా రూపొందించాలి. కంపెనీల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఓవర్ టైమ్ పై ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా లేబర్ ఇన్‌స్పెక్టర్‌కు ఉద్యోగి ఫిర్యాదు చేయవచ్చు. తమ ఓవర్‌టైమ్ వేతన హక్కులు ఉల్లంఘిస్తే, ఉద్యోగులు ఫిర్యాదు చేయడానికి లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి హక్కు ఉంటుంది.
ఉద్యోగి ఓవర్‌టైమ్ వేతనాలకు సంబంధించి పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 33C (2) కింద లేబర్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఒప్పంద ఉద్యోగులు అయితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చు. ఉద్యోగి రోజుకు 8–9 గంటలు లేదా వారానికి 48 గంటలు మించి పనిచేస్తే రెట్టింపు వేతనాలు పొందడానికి అర్హులు అవుతారు. అయితే ఫ్యాక్టరీల చట్టం, 1948 ప్రకారం, కార్య నిర్వాహక లేదా అడ్మినిస్ట్రేషన్ హోదాలో పనిచేసే వ్యక్తులు, లేదా ఒక నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ సంపాదించే వారు ఓవర్‌టైమ్ వేతనానికి అర్హులు కారు.