Ekam OTT : కొన్ని సినిమాలకు ఓటీటీ డీల్ అస్సలు సెట్ కాదు. అలా డిజిటల్ సంస్థలు పట్టించుకోక కొన్ని సినిమాలను యూట్యూబ్ లో ఫ్రీగా రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అచ్చం ఇలాగే ఓ వెబ్ సిరీస్ కి మేకర్స్ ఎంత ట్రై చేసినా ఓటీటీ డీల్ సెట్ అవ్వకపోవడంతో ఏకంగా ఒక సైట్ నే క్రియేట్ చేసి, అందులో రిలీజ్ చేసుకున్నారు. తీరా సిరీస్ ను ఆ సినిమా నిర్మాతలు ఇలా సొంత సైట్ లో రిలీజ్ చేసుకున్నాక, ఓ ఓటీటీ వెతుక్కుంటూ వచ్చి మరీ మూవీ రైట్స్ ను కొనుగోలు చేసింది. త్వరలోనే ఆ మూవీ సదరు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంత పెద్ద స్టోరీ ఏ వెబ్ సిరీస్ విషయంలో జరిగింది ? ఇప్పుడు అది ఏ ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
కన్నడ వెబ్ సిరీస్ ‘ఏకమ్’ను ఓటీటీలోకి తీసుకురావడానికి ఏకంగా 4 ఏళ్లు పట్టింది మేకర్స్ కి. ఈ నాలుగేళ్ళు కూడా నిర్మాతలు సిరీస్ విషయంలో అష్టకష్టాలు పడ్డారు. ఇంతా చేస్తే మెయిన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఏవీ ఈ కన్నడ కంటెంట్ ను కొనడానికి ఇంట్రెస్ట్ ను చూపించలేదు. చేసేదేం లేక మేకర్స్ చివరికి తమ షోను ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ (TVOD) కేటగిరీలో స్వయంగా వాళ్ళే రూపొందించిన ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేశారు. కాకపోతే ఈ సిరీస్ ని చూడడానికి ఆడియన్స్ రూ. 149 పే చేసేలా ప్లాన్ చేశారు.
ఇక కన్నడ వెబ్ సిరీస్ అయిన ‘ఏకమ్’ షూటింగ్ 2020లోనే మొదలైంది. కన్నడ నటుడు, చిత్రనిర్మాత రక్షిత్ శెట్టి పరమవా స్టూడియోస్ బ్యానర్ పై ఈ సిరీస్ మొత్తాన్ని నిర్మించాల్సి ఉంది. దీనికి రక్షిత్ శెట్టి నిర్మాతగా వ్యవహరించారు. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా ఇతర నిర్మాతలను ఇందులో భాగం చేశారు. 2022 నాటికి షూటింగ్ ను పూర్తి చేసుకున్న నిర్మాతలు సిరీస్ స్ట్రీమింగ్ పార్ట్నర్ కోసం కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ రెండు సంవత్సరాలు ట్రై చేసినా ఒక్క ఓటీటీ కూడా ఈ సిరీస్ వైపు చూడనేలేదు. ఇక విసిగిపోయిన నిర్మాతలు తమ సొంత ప్లాట్‌ఫామ్ ekamtheseries.com ను ఈ సిరీస్ కోసం ప్రత్యేకంగా స్టార్ట్ చేశారు. 2024 జూలైలో రూ. 149 అద్దెకు అక్కడే స్ట్రీమింగ్ షురూ చేశారు. ఇక ఎట్టకేలకు ఈ సిరీస్ కష్టాల కడలిని గట్టెక్కింది. జీ5 (Zee5) ఓటీటీలో 2026 జనవరి 9 నుండి ‘ఏకమ్’ను స్ట్రీమింగ్ చేయనుంది.
Read Also : మూడు ముఖాలతో ఉన్న వింత జీవి… ప్రేమ పేరుతో ప్రాణాలు తీసే పిశాచి… రోమాలు నిక్కబొడుచుకునే సీన్లు
కరావళి ప్రాంతానికి సంబంధించిన 7 కథల సంకలనం ‘ఏకమ్’ వెబ్ సిరీస్. సందీప్ పిఎస్ మిథ్యా, నిర్మాత సుమంత్ భట్ ఏ సిరీస్ కు షోరన్నర్స్. ఈ కథలను సుమంత్, సతీశన్ పుతుమన, సత్యజిత్ రౌత్, శశికాంత్ శెట్టి రాశారు. ఈ 7 కథలకు దర్శకత్వ బాధ్యతలను ఒక్కో దర్శకుడు తీసుకున్నారు. ఆ లిస్ట్ లో సుమంత్, స్వరూప్ ఎలామోన్, సనల్ అమన్, శంకర్ గంగాధరన్, వివేక్ వినోద్ వంటి డైరెక్టర్స్ ఉన్నారు. మిధున్ ముకుందన్, రాహుల్ జిగ్యాసు దీనికి సంగీతం అందించగా… రాజ్ బి శెట్టి, ప్రకాష్ రాజ్, షైన్ శెట్టి, మాన్సీ సుధీర్, బాసుమ కొడగు, పల్లవి కొడగు, బాబు అన్నూర్, ప్రకాష్ తుమినాద్, సుహాన్ శెట్టి, ఉజ్వల్ యువి తదితరులు ఈ సిరీస్ లో నటించారు.