Time Travel Thriller on OTT: ఇండియన్ సినిమా హిస్టరీని ఒకసారి పరిశీలిస్తే లవ్ స్టోరీలు, క్రైమ్, ఫ్యామిలీ డ్రామాలు ఎన్నో వస్తుంటాయి. అయితే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లు రావడం మాత్రం చాలా అరుదు. అయితే ఒక అరుదైన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన హిందీ వెబ్ సిరీస్ ‘జేఎల్ 50’ (JL50) ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం నాలుగు ఎపిసోడ్లతో, ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా సాగే ఈ సిరీస్‌ను ఒకసారి మొదలుపెడితే క్లైమాక్స్ వరకు కదలకుండా చూసేలా ఉంటుంది. ఈ కథలో 1984లో కోల్‌కతా నుంచి టేకాఫ్ అయిన విమానం ఆ తరవాత ఏమైందో తెలీకుండా పోతుంది. అయితే అదే విమానం 35 ఏళ్ల తర్వాత క్రాష్ అవ్వడం, అందులోని ఇద్దరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో ఈ కథ క్లైమాక్స్ వరకు రెప్ప వాల్చనివ్వదు. ఆ విమానం కథేంటో, ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
JL50 అనేది 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కొండ ప్రాంతంలో జరిగిన ఒక విమాన ప్రమాదంతో మొదలయ్యే సైన్స్-ఫిక్షన్ థ్రిల్లర్ కథ. మొదట దీనిని ఉగ్రవాదుల హైజాక్ కేసుగా భావించి సీబీఐ అధికారి శాంతను విచారణ ప్రారంభిస్తాడు. అయితే, ఆ విమాన శకలాలను పరిశీలించాక అది 1984లో కోల్‌కతా నుంచి బయలుదేరి ఆకాశంలో అదృశ్యమైన ‘ఫ్లైట్ JL50’ అని తెలిసి అధికారులు షాక్ అవుతారు.
35 ఏళ్ల క్రితం మాయమైన విమానం ఇప్పుడు కూలిపోవడమే కాకుండా, అందులో పైలట్ బిహు ఘోష్, ప్రొఫెసర్ బిస్వజిత్ మిత్రా ప్రాణాలతో బయటపడటం పెద్ద మిస్టరీగా మారుతుంది.
తాము 35 ఏళ్లు భవిష్యత్తులోకి వచ్చేశామని తెలిసి పైలట్ కంగారు పడగా, ప్రొఫెసర్ మిత్రా మాత్రం తన ప్రయోగం విజయవంతమైందని సంతోషిస్తాడు. ఈ అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించడానికి శాంతను క్వాంటమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ సుబ్రతో దాస్ సహాయం తీసుకుంటాడు. దర్యాప్తు కొనసాగే కొద్దీ, 1984లో భారత ప్రభుత్వం రహస్యంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఏఐ’ (Project AI), టైమ్ ట్రావెల్ ప్రయోగాల గురించి కీలక నిజాలు బయటపడతాయి. ప్రొఫెసర్ మిత్రా తన ప్రయోగం కోసం ఆ విమానాన్ని హైజాక్ చేసి వార్మ్‌హోల్ ద్వారా భవిష్యత్తులోకి ప్రయాణించాడని తెలుస్తుంది. చివరకు, విమానంలో ఉన్న అమాయక ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి శాంతను ప్రొఫెసర్ దాస్ కలిసి తిరిగి 1984లోకి వెళ్లి ఆ ప్రమాదాన్ని ఎలా ఆపారనేదే ఈ కథ ముగింపు.
శైలేందర్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ 4 ఎపిసోడ్ల మినీ సిరీస్‌ను 2017లోనే సినిమాగా షూట్ చేయగా, మూడేళ్ల తర్వాత 2020లో సోనీ లివ్ (Sony LIV)లో విడుదల చేశారు. ఇప్పటికీ ఓటీటీ ఆడియన్స్ ను కట్టిపడేస్తోంది ఈ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. అభయ్ డియోల్, పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా, రితికా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథ 1954లో మాయమై 35 ఏళ్ల తర్వాత కనిపించిందని ప్రచారంలో ఉన్న ‘శాంటియాగో ఫ్లైట్ 513’ ఆధారంగా, వాటికి క్వాంటమ్ ఫిజిక్స్, టైమ్ ట్రావెల్ అంశాలను జోడించి దర్శకుడు శైలేందర్ వ్యాస్ ఈ సిరీస్‌ను రూపొందించారు.