Telugu Mystery Thriller: ఓ ఊరిలో గంట మోగిన ప్రతిసారీ ఓ మరణం సంభవిస్తే ? ఆ చావులన్నీ వీరభద్ర స్వామి ఆగ్రహం వల్లే జరుగుతున్నాయని ప్రజలు నమ్మితే ? కానీ దైవ శక్తి వెనుక మనుషుల కుట్ర దాగి ఉందని ఓ యువతి అనుమానిస్తే ? అసలు వీరభద్రపురంలో ఏం జరుగుతోంది ? ఆ రహస్యం వెనుక ఉన్నది ఎవరు ? ఇలాంటి ఉత్కంఠభరితమైన మిస్టరీతో సాగుతున్న వెబ్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ (Veerabhadruni Rahasyam) ఇప్పుడు పార్ట్ 2తో మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి సెకండ్ పార్ట్ లో ఏం జరుగుతుంది ? ఫస్ట్ పార్ట్ స్టోరీ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
వీరభద్రపురం అనే గ్రామంలో వరుసగా వింత మరణాలు జరుగుతుంటాయి. విచిత్రంగా గుడిలో గంట మోగిన ప్రతిసారీ ఎవరో ఒకరు చనిపోతుండటంతో… ఆ మరణాలకు వీరభద్ర స్వామి ఆగ్రహమే కారణమని గ్రామస్తులు బలంగా నమ్ముతుంటారు. తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకాలు, రహస్యమైన ఆచారాలు ఈ ఊరి జీవితంలో భాగమైపోతాయి. ఇదే సమయంలో నగరానికి చెందిన డాక్టర్ వెన్నెల (యాని) తన తండ్రి కోసం వీరభద్రపురానికి వస్తుంది. అయితే అక్కడి పరిస్థితులు ఆమెకు అనుమానం కలిగిస్తాయి. దైవశక్తి వల్లే ఈ మరణాలు జరుగుతున్నాయనే విషయాన్ని ఆమె నమ్మదు. ప్రతి మరణం వెనుక ఎవరో మనుషులే ఉన్నారని భావిస్తుంది.
వెన్నెల దర్యాప్తు మొదలు పెట్టి గ్రామంలోని పాత రహస్యాలను బయటకు తీస్తుంది. గుడి తాళాలు, అర్ధరాత్రి జరిగే పూజలు, ఊరిలోని పాత శత్రుత్వాలు… ఒక్కొక్కటిగా కొత్త ప్రశ్నలను లేవనెత్తుతాయి. ఆమె అన్వేషణ ముందుకు వెళ్లేకొద్దీ ఇది కేవలం మూఢనమ్మకాల కథ కాదని, చాలా కాలంగా దాచిపెట్టిన ఓ సీక్రెట్ తో ముడిపడి ఉందని అర్థమవుతుంది. మొదటి భాగం ముగిసేసరికి అసలు రహస్యం మరింత ముదురుతుంది. ఇప్పుడు పార్ట్ 2లో ఈ భయానక ఆచారాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు ? విశ్వాసం పేరుతో జరుగుతున్న ఈ ఆటలో వెన్నెల ఎలాంటి నిజాలను బయట పెట్టబోతోంది ? గతంలో జరిగిన పాపాలు వర్తమానాన్ని ఎలా వెంటాడుతున్నాయి ? అన్నదే ఆసక్తిని రేకెత్తిస్తున్న సస్పెన్స్ ఫుల్ స్టోరీ.
‘వీరభద్రుని రహస్యం’ (Veerabhadruni Rahasyam) సీజన్ 1 మొత్తం 60 ఎపిసోడ్ల సుదీర్ఘ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందింది. మొదటి 30 ఎపిసోడ్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సిరీస్ ఏకంగా 300 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ నమోదు చేసినట్లు మేకర్స్ తెలిపారు. భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో రఘు కుంచె, యాని, కల్కి రాజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘జీ5’ (ZEE5)లో సెప్టెంబర్ 4 నుంచి పార్ట్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. ప్రతి బుధవారం ఐదు ఎపిసోడ్లు విడుదల కానున్నాయి. భక్తి, మూఢనమ్మకాలు, సైకాలజీ, క్రైమ్ మిస్టరీ కలిసిన కథలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి థ్రిల్ అందించే అవకాశం ఉంది.
Read Also: పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ