Italian Horror Thriller on OTT: మనసులో ఏదైనా పెద్ద బాధ ఉన్నప్పుడు మనకు ఇష్టమైన వాళ్లు ఒక్కసారి ఆప్యాయంగా కౌగిలించుకుంటే ఆ బాధ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. అయితే ఒక ఊరిలో ఉండే 15 ఏళ్ల కుర్రాడిని కౌగిలించుకుంటే చాలు.. జీవితంలోని కష్టాలు, దుఃఖాలన్నీ మాయమైపోయి అందరూ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారంటే నమ్ముతారా? వినడానికే ఏదో మాయాజాలంలా ఉన్నా, ఆ ఊరి సంతోషం వెనుక ఒక ఒళ్లు గగుర్పొడిచే భయంకరమైన శాపం ఉంటుంది. ఈ అదిరిపోయే కంటెంట్ తో ఒక థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను వణికిస్తోంది. ఫెంటాస్టిక్ ఫెస్ట్, వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుని, రొటెన్ టొమాటోస్‌లో ఏకంగా 92 శాతం పాజిటివ్ స్కోర్ సాధించిన ఈ ఇటాలియన్ సైకలాజికల్ ఫోక్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది హోలీ బాయ్’ (The Holy Boy). రొటీన్ దెయ్యాల సినిమాలకు పూర్తి భిన్నంగా, మనుషుల స్వార్థం ఎంత భయంకరంగా ఉంటుందో కళ్లకు కట్టిన ఈ హారర్ థ్రిల్లర్ డిజిటల్ తెరపై గత్తరలేపుతోంది.
తన కొడుకును కోల్పోయిన బాధతో మానసికంగా కుంగిపోయిన సెర్గియో రోసెట్టి అనే టీచర్, ఇటలీలోని రెమిస్ అనే మారుమూల కొండ ప్రాంత గ్రామానికి బదిలీ అవుతాడు. ఆ ఊరికి వెళ్లిన తర్వాత అక్కడి ప్రజలంతా ఎప్పుడూ నవ్వుతూ, ఎలాంటి దిగులు లేకుండా కనిపించడం అతడికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఆ సంతోషం వెనుక ఓ విచిత్రమైన ఆచారం ఉందని తెలుసుకుంటాడు. ప్రతి వారం గ్రామస్తులంతా మాటియో అనే 15 ఏళ్ల బాలుడిని కౌగిలించుకోవడానికి వస్తుంటారు. అతడిని హత్తుకుంటే తమ మనసులోని బాధలు, దుఃఖాలు తొలగిపోతాయని వాళ్ల నమ్మకం.
మొదట ఇదేదో అద్భుత శక్తిలా అనిపించినా.. మాటియోతో పరిచయం పెరిగిన కొద్దీ సెర్గియోకు అసలు విషయం అర్థమవుతుంది. ఊరి ప్రజల బాధల నుంచి వారికి ఉపశమనం కలిగించే క్రమంలో ఆ బాధల భారాన్ని మాటియోనే మోస్తుంటాడు. తమ సంతోషం కోసం ఓ చిన్న పిల్లాడిని ఇలా ఉపయోగించుకోవడం సెర్గియోను కలచివేస్తుంది. దీంతో ఆ బాలుడిని ఈ వింత ఆచారం నుంచి బయటపడేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ మాటియోను కాపాడాలనే అతడి ప్రయత్నం గ్రామస్తుల్లో ఆగ్రహాన్ని రేపుతుంది. బయటకు ఎంతో మంచివాళ్లుగా కనిపించే ఆ ఊరి ప్రజల అసలు స్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతుంది. చివరికి మాటియోను కాపాడేందుకు సెర్గియో ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చింది? ఆ ఊరి సంతోషం వెనుక ఉన్న చీకటి నిజం ఏంటనేదే మిగతా కథ. దెయ్యాల సినిమాల కంటే భిన్నంగా, మానసిక వేదన చుట్టూ సాగే డార్క్ హారర్ కథలను ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్.
‘ది హోలీ బాయ్’ మూవీకి పాలో స్ట్రిప్పోలి దర్శకత్వం వహించగా, మిచెల్ రియోండినో సెర్గియోగా, గియులియో ఫెల్ట్రీ మాటియోగా కీలక పాత్రలు పోషించారు. 2025 ఆగస్టులో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు వచ్చిన ఈ సినిమా, అదే ఏడాది సెప్టెంబర్ 17న ఇటలీలో థియేటర్లలో విడుదలైంది. 2025 ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో బెస్ట్ పిక్చర్ ఆడియన్స్ అవార్డు, బెస్ట్ డైరెక్టర్ నెక్స్ట్ వేవ్ అవార్డులను గెలుచుకుంది. 2 గంటల 2 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం 2026 నవంబర్ 27 నుంచి Shudderలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ ఇటాలియన్ భాషలో రూపొందిన ఈ మూవీకి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి.
Read Also: మృత్యువు వెంటాడుతున్న నగరం… చావు లేని ఆ ఒక్కడి కోసం వేట… తెలుగులో అదిరిపోయే థ్రిల్లర్