Corporate Love Story on OTT: ఐటీ కంపెనీల్లో పనిచేసేవాళ్లకు వర్క్ టెన్షన్, డెడ్‌లైన్లు, టార్గెట్లు కొత్తేమీ కాదు. ఉదయం ఆఫీసుకు వెళ్లిన దగ్గరి నుంచి సాయంత్రం వరకు పని హడావుడిలోనే సమయం గడిచిపోతుంది. అలాంటి చోట ఇద్దరు ఉద్యోగుల మధ్య ప్రేమ పుడితే.. ఆఫీసు పనితో పాటు ప్రేమను కూడా ఎలా నడిపిస్తారు? అందులోనూ జనాలకు జోడీలను వెతికిపెట్టే డేటింగ్ యాప్‌ను తయారు చేసే కంపెనీలోనే పనిచేస్తూ, తమ ప్రేమను మాత్రం రహస్యంగా ఉంచాల్సి వస్తే పరిస్థితి ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో కదా. బెంగళూరు లో సాగే ఇలాంటి యూత్‌ఫుల్ కంటెంట్ తో రూపొందిన కన్నడ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ‘కార్పొరేట్ లవ్ స్టోరీ’ (Corporate Love Story) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కన్నడ స్టార్ నటి ప్రియాంక ఉపేంద్ర కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్ కథ ఏంటి ? ఏ ఓటీటీలో చూడచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీ నేపథ్యంలో సాగుతుంది. ఈ సంస్థ ‘వన్ లవ్’ పేరుతో డేటింగ్ యాప్‌ను రూపొందించే పనిలో ఉంటుంది. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో యాప్‌ను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో యాప్ డిజైనర్‌గా నిత్య (సంజన దాస్) కంపెనీలో చేరుతుంది. అక్కడ ప్రొడక్ట్ హెడ్‌గా పనిచేసే అర్జున్ (ప్రణవ్ శ్రీధర్)తో ఆమెకు పరిచయం అవుతుంది.
అర్జున్ ఎప్పుడూ పని, బాధ్యతల గురించే ఆలోచిస్తుంటాడు. నిత్య మాత్రం ఉత్సాహంగా ఉంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతుంది. మొదట్లో ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉన్నా.. కలిసి పనిచేసే క్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. అయితే ఆఫీసులో తమ సంబంధం బయటపడితే ఎదురయ్యే ఇబ్బందులు ఒకవైపు, ఇంట్లో పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి మరోవైపు వీరిని ఇబ్బంది పెడతాయి. ఈ పరిస్థితుల్లో తమ కెరీర్‌ను, ప్రేమను ఎలా ముందుకు తీసుకెళ్లారు? వాళ్ళకు ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి? అనేది సిరీస్‌లో చూడాలి. ఆఫీసు వాతావరణం, యువత ఎదుర్కొనే ప్రేమ, కుటుంబ సమస్యలను కలిపి ఈ కథను తెరకెక్కించారు. ఈ సిరీస్ లైట్ హార్టెడ్ లవ్ స్టోరీలను ఇష్టపడే యువతకు బాగా నచ్చుతుంది.
‘కార్పొరేట్ లవ్ స్టోరీ’ 2026 నవంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. పన్నగ భరణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ప్రియాంక ఉపేంద్ర, సంజన దాస్, ప్రణవ్ శ్రీధర్, నైనా కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఒరిజినల్ కన్నడ భాషలో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు.
Read Also: భర్తలకు తెలియకుండా భార్యల రహస్య పార్టీలు… ఓటీటీలో సంచలన సిరీస్