Tamil Thriller Series on OTT: మన పక్కింట్లోకి కొత్తగా ఎవరైనా అద్దెకు దిగితే వాళ్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. అయితే అదే ఇంట్లో ఉంటున్న మహిళ అకస్మాత్తుగా కనిపించకుండా పోతే, ఆమె భర్త ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి కాలనీలోని వాళ్లంతా ఒక్కటై విచారణ మొదలుపెడితే.. ఆ కథలో ఎన్నో మలుపులు ఉంటాయి కదా.. ఇలాంటి ఆసక్తికరమైన స్టోరీతో తెరకెక్కిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఆక్టోపస్’ (Octopus) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ‘కూసే మునిసామి వీరప్పన్’ డాక్యుమెంటరీతో గుర్తింపు తెచ్చుకున్న జయచంద్ర హష్మి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కథేంటి? ఏ ఓటీటీలో చూడచ్చో తెలుసుకుందాం.
వరుణ్ (అశ్విన్ కుమార్), నికిత (సింధు కుమరేశన్) అనే కొత్త జంట అన్బు నగర్ అనే ప్రశాంతమైన కాలనీలోకి అద్దెకు దిగుతారు. నికిత అందరితో కలుపుగోలుగా ఉంటూ త్వరగానే కాలనీలోని వాళ్లతో పరిచయం పెంచుకుంటుంది. కానీ ఆమె భర్త వరుణ్ ప్రవర్తన మాత్రం మొదటి నుంచీ అనుమానాలు కలిగిస్తుంది. అదే కాలనీలో ఉండే అర్చన (అర్చన రవిచంద్రన్) ఒక క్రైమ్ పాడ్‌కాస్టర్. వరుణ్ ప్రవర్తనను గమనించిన ఆమెకు ఆ ఇంట్లో ఏదో జరుగుతోందనే అనుమానం మొదలవుతుంది. నికిత శరీరంపై గాయాలు కనిపించడంతో ఆమె గృహహింసకు గురవుతోందేమోనని కూడా అర్చన భావిస్తుంది.
ఇంతలో ఒకరోజు నికిత అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. దీంతో ఆమె ఏమైందో తెలుసుకోవడానికి అర్చనతో పాటు కాలనీలోని కొంతమంది రంగంలోకి దిగుతారు. ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ వరుణ్‌పై అనుమానాలు పెరుగుతాయి. అయితే కనిపిస్తున్న విషయాలన్నీ నిజమేనా? నికిత అదృశ్యం వెనుక అసలు కారణం ఏమిటి? కాలనీ వాసులకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి? చివరకు ఈ వ్యవహారం కోర్టు వరకు ఎలా వెళ్తుంది? అనేది మిగతా కథ. ఒక కాలనీ వాసులే డిటెక్టివ్‌లుగా మారి ఓ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ప్రయత్నించడంతో ఈ సిరీస్ కూడా చాలా ఇంటెన్స్ గా సాగుతుంది.
ఈ తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఆక్టోపస్’ (Octopus) 2026 నవంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం ఏడు ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి. జయచంద్ర హష్మి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అశ్విన్ కుమార్ వరుణ్‌గా, సింధు కుమరేశన్ నికితగా, అర్చన రవిచంద్రన్ అర్చనగా, వినోద్ కిషన్ భరత్‌గా నటించారు. అయితే ప్రస్తుతం ZEE5లో ఈ సిరీస్ తమిళ ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. మిస్సింగ్ కేసులు, అనుమానాలు, ఊహించని మలుపులతో సాగే కథలు ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను ప్రయత్నించవచ్చు.