Thriller Web Series : ఓటీటీలోకి బెంగాలీ హిస్టారికల్ థ్రిల్లర్ సిరీస్ మరి కొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. 1971 నాటి బంగ్లాదేశ్ విభజన సమయంలో, కోల్‌కతా జాజ్ క్లబ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. గూఢచారి వ్యవస్థ, విప్లవ రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక దేశం పుట్టుక వెనుక ఉన్న పోరాట గాథ. ఈ సిరీస్ మొదట ఫిబ్రవరి 6న విడుదల కావాల్సి ఉండగా, తరువాత వాయిదా పడింది. ఇప్పుడు మరో రిలీజ్ డేట్ ని ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. మరి ఈ సిరీస్ ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఈ బెంగాలీ హిస్టారికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘జాజ్ సిటీ’ (Jazz City). గులాబ్ గ్యాంగ్ ఫేమ్ సౌమిక్ సేన్ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇది 2026 మార్చి 19న Sony LIV ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది బెంగాలీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో షతాఫ్ ఫిగర్, శాంతాను ఘటక్, అమిత్ సాహా, అలెగ్జాండ్రా టేలర్, శ్రేయ భట్టాచార్య, సయందీప్ సేన్, తానికా బసు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
1971 నాటి కలకత్తా నేపథ్యంలో స్టోరీ సాగుతుంది. అప్పట్లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్‌తో యుద్ధం జరుగుతున్న సమయం అది. కలకత్తా నగరంలోని ఒక జాజ్ మ్యూజిక్ క్లబ్ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. కేవలం సంగీతం కోసం మాత్రమే కాకుండా, ఈ క్లబ్ గూఢచారి కార్యకలాపాలకు, విప్లవకారులకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. క్లబ్‌లో పాడే పాటలు, వాయించే సంగీతం వెనుక దేశభక్తికి సంబంధించిన రహస్య సంకేతాలు దాగి ఉండటం ఈ కథలోని అసలు ట్విస్ట్.
ముఖ్యంగా బంగ్లాదేశ్ నటుడు అరిఫిన్ షువో ఇందులో జిమ్మీ అనే పాత్రలో కనిపిస్తారు. ఒక పక్క యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, మరోపక్క సంగీతాన్ని ఆయుధంగా చేసుకుని శత్రువుల ఎత్తుగడలను ఎలా చిత్తు చేశారు అనేదే ప్రధాన కథాంశం. దేశం కోసం ప్రాణాలకు తెగించే గూఢచారులు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోయే ఎమోషన్స్ కూడా ఈ సిరీస్‌లో చాలా ఉత్కంఠభరితంగా చూపించారు.