ఒక నాయకురాలు ప్రజల మనసులు గెలుచుకోవాలంటే ఏం చేయాలి? ప్రసంగాలతోనా? పథకాలతోనా? రాజకీయ వ్యూహాలతోనా? కానీ భారత రాజకీయ చరిత్రలో ఒక మహిళ మాత్రం వీటన్నింటికీ మరో శక్తివంతమైన అంశాన్ని యాడ్ చేశారు. అదే… ఆమె కట్టుకునే చీర. ఆమె చీర కేవలం వస్త్రం కాదు. ఒక పొలిటికల్ స్టేట్‌మెంట్. ఒక కల్చరల్ ఐడెంటిటీ. అంతర్జాతీయ వేదికపై ఇండియాను ఇంట్రడ్యూస్ చేసిన ఒక శక్తివంతమైన విజువల్ రిప్రజంటేషన్. ఆమె ఎవరో కాదు… భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ. ఐరన్ లెడీగా గుర్తింపు పొందిన ఇందిరా గాంధీ.. తన చీరలతో కూడా ఇండియాకు ఒక గుర్తింపును తీసుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ లోక్‌సభ బైపోల్ జరిగే టైమ్ అది. ఏపీ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల తర్వాత ఇందిరా గాంధీకి ఇది మరో కీలకమైన రాజకీయ పోరాటం. తన పార్టీ అభ్యర్థి మొహ్సినా కిద్వాయ్ గెలుపు కోసం ఇందిర స్వయంగా రంగంలోకి దిగారు. చివరి దశ ప్రచారంలో కేవలం 30 గంటలలోపే 24 ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. 14 గంటల పాటు దుమ్ము, ఎండలో ప్రయాణించినా ఆమె చీర నలగకుండా ఉండేదని ఆమె జీవిత చరిత్ర రాసిన రైటర్.. పుపుల్ జయకర్ చెప్పేవారు. గ్రామీణ ప్రజలకు ఇది చిన్న విషయం కాదు. తలపై కొంగు కప్పుకుని, సాధారణ చేనేత చీరలో తమ ముందుకు వచ్చిన ఇందిరలో వారు ఒక రాజకీయ నాయకురాలినే కాదు… తమలో ఒకరిని చూసుకునేవారు, ఆమెలో ఒక ఆప్యాయతను చూశారు.
అయితే ఇందిర గాంధీ సెలెక్ట్ చేసుకున్న ఈ చీరకట్టులోనూ ఒక చరిత్ర ఉంది. దీనిని నీవీ డ్రేప్ అంటారు. 19వ శతాబ్దంలో జ్ఞానదానందిని దేవి ఈ చీరకట్టు శైలిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వారిలో ఒక ముఖ్య వ్యక్తి అనుకొవచ్చు. ఆ తర్వాత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహిళలు కూడా ఇదే స్టైల్‌లో చీరను ధరించడం ప్రారంభించారు. రాజకీయ సభలు, నిరసనలు, ఉద్యమాల్లో చీరకట్టుతో కనిపించిన మహిళల ఫొటోలు పత్రికల్లో ప్రింట్ అయ్యేవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సినిమాలు, ప్రభుత్వ అధికారిక యాడ్స్, రాజకీయ నాయకులు, ప్రముఖ మహిళల ద్వారా చీర ఒక జాతీయ గుర్తింపుగా మారింది. ఇందులో ఇందిరా గాంధీ పాత్ర చాలా కీలకం.
ఇందిరా గాంధీ చీరను సెలెక్ట్ చేసుకోవడం కూడా కోఇన్సిడెన్స్ కాదు. సిచ్యూవేషన్‌ను బట్టి.. ఆమె చీర స్టైల్ మారేది. దేశంలో పర్యటించేటప్పుడు ఎక్కువగా ఖాదీ, చేనేత కాటన్ చీరలనే ధరించేవారు. దీని ద్వారా గాంధీ, నెహ్రూల స్వదేశీ ఉద్యమ వారసత్వాన్ని గుర్తుచేసేవారు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రత్యేకమైన చేనేత చీరను ధరించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. బెంగాల్‌లో టాంగైల్ చీర, దక్షిణాదిలో కోయంబత్తూరు కాటన్, పశ్చిమ భారతంలో సంగనేరి ప్రింట్స్. దీని వెనుక ఒక స్పష్టమైన సందేశం ఉండేది. నేను మీ ప్రాంతానికి వచ్చాను. మీ సంస్కృతిని గౌరవిస్తున్నాను. మీ సంప్రదాయం కూడా భారతదేశపు గర్వకారణమే.. అనే మెసేజ్ ఇచ్చేవారు. ఒక ప్రధానమంత్రి ప్రాంతీయ చేనేతను ధరించడం ద్వారా స్థానిక కళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది కదా.
అయితే విదేశీ పర్యటనల్లో ఇందిరా గాంధీ డ్రెస్సింగ్ స్టైల్ మరోలా ఉండేది. 1966లో తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లినప్పటి నుంచే తన డ్రెస్సింగ్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఏ ప్రొగ్రామ్‌కు ఏ చీర? ఏ బ్లౌజ్? ఎలాంటి చెప్పులు? ఏ బ్యాగ్? అన్నీ ముందుగానే నిర్ణయించుకునేవారు. 1970లలో అమెరికా టూర్‌లలో ఖరీదైన, రంగురంగుల పట్టు చీరలు ధరించేవారు. ప్రత్యేకంగా అలంకరించిన జుట్టు, తగిన మేకప్‌తో కనిపించేవారు. దీనికి ఇంటర్నేషనల్ పొలిటికల్ ఇష్యూస్ కూడా ఒక కారణం.
కోల్డ్ వార్ టైమ్‌లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు.. భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రపంచానికి చాటుతోంది. ఆ టైమ్‌లో ఇందిరా గాంధీ తన మాటలు, చేతలు, డ్రెస్సింగ్ ఇలా అన్నింటితో ఇండియా న్యూట్రల్ అనే మెసేజ్ ఇచ్చేవారు. అంతేందుకు విదేశీ నేతలకు ఆతిథ్యం ఇచ్చినా, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నా… ఇందిర తన డ్రెస్సింగ్‌తో భారతీయతను చాటి చెప్పేవారు. ఇంట్లో సాధారణ ఖాదీ, కాటన్ చీరలు… అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేకమైన పట్టు చీరలు.
అందుకే ఇందిరా గాంధీ చీరను కేవలం ఫ్యాషన్‌గా చూడలేం. అది ఒక రాజకీయ వ్యూహం. ఒక సాంస్కృతిక సందేశం. ఒక జాతీయ గుర్తింపు. ఎందుకంటే… కొన్నిసార్లు ఒక నాయకురాలి ప్రసంగం కంటే, ఆమె ధరించిన చీరే ప్రపంచానికి ఒక దేశం గురించి ఎక్కువ చెబుతుంది.