ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై పార్టీలకతీతంగా చర్చ జరుగుతోంది. రైతు బీమాను ఎత్తేశారనే చర్చ మొన్నటి వరకు సాగింది. రైతులకు అంతలా మేలు చేసే పథకాన్ని ఎత్తేస్తారా? అనే విమర్శలు కూడా ఎదుర్కున్నది రేవంత్ సర్కార్. అయితే ఇందిరమ్మ బీమా ఉద్దేశ్యం తెలిసిన తరువాత భేష్ అనకుండా ఉండలేకపోతున్నారట. అవును.. ప్రతి పేద కుటుంబానికి ఇది ఆసరాగా నిలుస్తున్న తీరు పార్టీలకతీతంగా ఆకట్టుకుంటున్నది. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నది. ఈ నెల 19న సిద్దిపేటలో ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకానికి అంకురార్పణ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రైతు బీమా పథకం కేసీఆర్‌కు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. దేశంలోనే ఎక్కడా ఇలా రైతులకు బీమా చేసిన సర్కార్ లేదు. రైతులు ఏ కారణంతో చనిపోయినా.. ఆ కుటుంబ పెద్దగా ఆసరా కోల్పోతే 5 లక్షల రూపాయల ఆర్థికసాయంగా బీమా బాసటగా నిలిచే ఈ స్కీమ్ అందరి చేత ప్రశంసలు అందుకున్నది. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 66వేల మంది రైతుల కుటుంబాలను ఈ బీమా ఆదుకున్నది. దీని కోసం ప్రతి ఏడాది ఎల్ఐసీ సంస్థకు రూ. 1360 కోట్లను ప్రీమియం కింద చెల్లించేది సర్కార్. దీని వల్ల 42.16 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేది. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత కూడా ఈ ప్రీమియంను చెల్లిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 14 వరకూ ఈ రైతు బీమా నడిచింది. కానీ ఆ తరువాత రేవంత్ సర్కార్ బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇది ఆగిపోయింది.
దీనిపై బీఆరెస్ గగ్గోలు పెట్టింది. కేసీఆర్ రైతు బీమాను ఆపేశారని, కేసీఆర్‌కు మంచిపేరు రావడం ఇష్టం లేకే సీఎం రేవంత్‌రెడ్డి ఇలా చేశారని విమర్శల దాడి కొనసాగింది. వాస్తవానికి, ఆగస్టు నుంచి ఇప్పటి వరకు.. అంటే మూడు నెలలుగా ఈ పథకం బంద్ అయ్యింది. కానీ సర్కార్ దీన్ని నిలిపివేయడానికి కారణం ఉంది. అంతా రాజకీయ కోణంలో చూశారు. బడ్జెట్ లేక ప్రీమియం చెల్లించలేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ సర్కార్ మదిలో ఓ బృహత్తర పథకం రూపుదిద్దుకుంటున్నదనే విషయం ఎవరికీ తెలియదు.
ఇందిరమ్మ జయంతి ఈనెల 19న ఉంది. ఈ రోజునే ఎప్పటికీ జనానికి గుర్తిండిపోయేలా, రేవంత్ సర్కార్ పాలనలో అది ఓ మరుపురాని పథకంగా, జనాల మదిలో నిలిచేపోయే పథకంగా ఉండాలనే విధంగా దీన్ని రూపొందించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పేరుతో ప్రవేశపెట్టే ఈ పథకం.. ప్రతీ పేద కుటుంబానికి ఎంతో బాసటగా నిలవనుంది. కోటి.. కోటిపైగా కుటుంబాలకు ఇది ఆర్థిక భరోసా ఇచ్చేందుకు, వెన్నుదన్నుగా నిలిచే పథకంగా భేష్ అనిపించుకోనుంది.
రైతుబీమా ద్వారా 42.16 లక్షల మంది రైతులే ఈ పథకం కింద లబ్ది చేకూరే కుటుంబాలుగా ఉండేవి. ఇప్పుడు రేవంత్ సర్కార్ తెస్తున్న ఇందిరమ్మ బీమా ద్వారా కోటి కుటుంబాలు.. అంటే రైతు బీమాకు రెట్టింపు లబ్దిదారులు ఈ బీమా పరిధిలోకి వస్తున్నారు. దీంతో ఇది పార్టీలకతీతంగా ప్రశంసలు అందుకుంటున్నది. దీని కోసం సర్కార్ రూ. 4వేల కోట్లు కేటాయించింది. ప్రీమియం కింద దాదాపు రూ.3,225 కోట్లు చెల్లించనుంది. రేషన్‌కార్డుల సంఖ్య పెరిగే కొద్దీ ఇందిరమ్మ బీమా లబ్దిదారుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది.
రైతు బీమా తరహాలోనే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన ఇంటి పెద్దకు ఈ పథకం వర్తించేలా ప్రణాళికలు చేశారు. తల్లి లేదా భార్య…ఆ కుటుంబ పెద్ద ఇష్టానుసారం నామినీని పెడతారు. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండే యజమాని ఏదైనా కారణంతో మృత్యువాత పడిన, సాధారణ మరణం సంభవించినా.. వారికి బీమా ద్వారా 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
అయితే, ఇప్పటికే రూ. 2 లక్షల జీవిత బీమా కూడా కొన్ని శాఖలకు అందుతున్నది. స్వయం సహాయక సంఘాల గ్రూపులకు, ఉపాధి కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు.. అసంఘటిత రంగ కార్మికులకు ఇది వరలో రూ. 2లక్షల బీమా ఉండేది. పీఎంజేజేబీవై కింద బ్యాంకు ఖాతాదారులకు కూడా రెండు లక్షల బీమా ఉండేది. ఇప్పుడు వీరందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకురానున్నారు. అయితే ప్రమాదవశావత్తు చనిపోయిన వారికి ఈ పథకాల్లో రూ. 10లక్షల సాయం అందించే వెలుసుబాటును యథతథంగా ఉంచుతున్నారు.