పాము పగ.. తోక చుట్టం..! ఈ సామెత నల్లగొండ జిల్లాలో బాగా నానుడిలో ఉంది. దీని అర్థం.. పాము అంటే గిట్టదు.. మరి తోకతో దోస్తానా.. ఎందుకు? అని. అచ్చంగా ఇలాగే ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరు. రేవంత్ సర్కార్ నచ్చలేదంటున్నాడు. అసలు అది పాలనే కాదంటున్నాడు. రేవంత్ తీరు పై తీవ్ర విమర్శలూ చేస్తున్నాడు. ఇదేం మాట తీరు..? ఇదేం పరిపాలన.. ? ఇట్ల చేస్తే కాంగ్రెస్ మళ్లీ వచ్చినట్టేనని నిష్టూరమాడుతున్నాడు. ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. బాగా పాలించు..అని హితబోధ చేస్తూనే.. ఇక రెండోసారి నీకు సీఎం పదవి ఉండదు.. అని ఇన్‌డైరెక్టుగా సిగ్నల్ ఇస్తున్నాడు. అసలు కోమటిరెడ్డి మాటల్లో మర్మమేమిటీ? నేరుగా సీఎంను రెచ్చగొట్టి, బెదిరించే తీరు వెనుక ఉన్న వ్యూహమేమిటీ? ఆయనకు పార్టీలో దొరుకుతున్న మద్దతు ఏపాటిది?
అధిష్టానం మాటిచ్చింది కోమటిరెడ్డికి. మంత్రి పదవి ఖాయంగా ఇస్తామని. కానీ మాట నిలబెట్టుకోలేకపోయింది. ఒకే ఇంట్లో ఇద్దరికా.. ? అనే కోణం ఒకటైతే, సామాజిక సమీకరణ మరో కోణం. అందుకే మాట తప్పారు. కానీ కోమటిరెడ్డి మాత్రం.. అధిష్టానం వెనుకడుగు వేయడాన్ని తప్పుబట్టాడు. మాటిచ్చినప్పుడు ఇది గుర్తు రాలేదా? తనకు ‘అప్పగించిన పనిని నిర్విగ్నంగా చేశాను.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే క్రమంలో ఢిల్లీ పెద్దలు తనపై పెట్టిన బాధ్యతలన్నీ నెరవేర్చాను. మరి ఇప్పుడు ఓడదాటినాకా బోడి మల్లన్న అనడం న్యాయమా?’ అని నిలదీస్తూ వచ్చాడు.
మూడేండ్ల కాలం ముగిసింది. రేపు, మాపు అని ఊరించినా..ఇస్తారని ఆశతో మొన్నటి వరకు ఎదురుచూసినా.. ఇక ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టేనని రూడీ చేసుకున్నట్టున్నాడు కోమటిరెడ్డి. అందుకే తన నిరసన గళాన్ని కాస్త పెంచాడు. బెదిరింపులు, రెచ్చగొట్టే తన స్టైల్ పాలిటిక్స్‌కు మరింత పదును పెట్టాడు. నేరుగా సీఎంపైనే. ప్రధాన ప్రతిపక్ష నేతకు ఏ మాత్రం తగ్గని రీతిలో … పార్టీకి, ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా రేవంత్ రాజకీయానికి కూడా డ్యామేజీ చేసేలాగే ఆయన విపరీత కామెంట్స్ ఉంటున్నాయి.
రాజకీయాల్లో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారగా.. పార్టీ అంతర్గతంగా తీవ్ర చర్చకు తెర తీసింది. కోమటిరెడ్డి ప్రకోపానికి, రెబల్ రాజకీయానికి కారణం.. మంత్రి పదవి రాకపోవడమేనా? అనే మొదటి ప్రశ్న, అనుమానానికి అవుననే సమాధానమే మెజారిటీ నుంచి వస్తోంది. అయితే.. ఈ ఒక్క కారణమే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో సహజంగా ఉండే రెబల్ మనస్తత్వాన్ని మరింత రెచ్చగొట్టి, ప్రోత్సహించినట్టయ్యింది. అందుకే ఇలా చెలరేగిపోతున్నాడని నిర్దారణకు వచ్చిందట ఆ పార్టీ అధిష్టానం.
ఈ మూడేండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. నిధులు రావడం లేదనేది ప్రధాన కారణం. పదవుల పంపకంలో తీవ్ర జాప్యమూ తీవ్ర సంతృప్తికి తావిస్తోంది. సరిగ్గా ఈ సందర్భాన్ని తన రెబల్ రాజకీయానికి కరెక్టుగా రాజగోపాల్ రెడ్డి వాడుకుంటున్నారంటున్నారు. కొత్త, పాత కలయికలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు తగిన న్యాయం జరగడం లేదనే ప్రచారం మొదటి నుంచి ఉంది.
రేవంత్ రెడ్డి తన వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని, హార్డ్ కోర్ కాంగ్రెస్ నేతలకు తగిన న్యాయం జరగడం లేదనేది బాధిత వర్గంగా చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు బాహాటంగానే కామెంట్స్ చేసుకుంటున్నారు. ఎలాగూ మంత్రి పదవి ఇవ్వరు. అది కన్ఫాం. మరి ఊరికనే ఉంటే రాజగోపాల్‌రెడ్డి ఎందుకవుతాడు? అందుకే ఇలా తనదైన రెబల్ రాజకీయానికి తెర తీశారంటున్నారు.
అయితే రాజగోపాల్‌రెడ్డి కామెంట్స్‌ను ప్రతిపక్ష పార్టీలే కాదు.. ఆపార్టీలోని సీనియర్లు, కాంగ్రెస్ పార్టీ హార్డ్ కోర్ క్యాడర్ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. వీరు రేవంత్ సర్కార్‌ను కాపాడే ప్రయత్నం చేయకపోగా.. మౌనంగా ఉండటం మూలంగా తమ సంఘీభావం అతనికి ఉందనే విధంగానే వారి ప్రవర్తన ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘అవును .. రాజగోపాల్‌రెడ్డి మాటల్లో తప్పేముంది? వాస్తవాలే చెబుతున్నాడు.. కాకపోతే అది పార్టీకి నష్టం జరిగేలా బాహాటంగా చేస్తున్నాడు అంతే..! ఇప్పుడు పాలన, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు అందుకు భిన్నంగా ఏం లేవు కదా?’ అనే విధంగా అతని వ్యవహార శైలిని సమర్థిస్తున్నట్టుగానే పార్టీ సీనియర్ల కామెంట్స్ ఉంటున్నాయట. ఈ పరిణామాలను గమనిస్తూ తన గళాన్ని మరింత పెంచుతూ పోవాలనే డిసైడ్ అయ్యాడట కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.
ఈ రెండేండ్ల కాలంలో వీలనైంతగా తన నియోజకవర్గం మునుగోడుకు నిధులు రాబట్టుకోవడం, పదవులు ఇప్పించుకోవడం ఓ వ్యూహమైతే.. కాంగ్రెస్ పార్టీ మేలు కోరి, భవిష్యత్తులో ఆ పార్టీ పటిష్టత కోసమే తన కామెంట్స్ తప్ప మరోటి కాదనే విధంగా తనకు తాను డిఫెన్స్ చేసుకునే ఎత్తుగడను కూడా ప్లే చేస్తున్నాడంటున్నారు.
‘రాహుల్‌ను ప్రధాని చేయడమే తన అంతిమ లక్ష్యమ’ని అనడం వెనుక.. తను పార్టీ మారబోనని సంకేతమిస్తూనే.. రేవంత్ వైఖరి సరిగ్గా లేదు.. నిధులు, పదువుల పంపకాల్లో అన్యాయం జరుగుతోందని చెప్పడం ఆ కామెంట్స్ వెనుక ఉన్న మర్మంగా చూస్తున్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రులం మేమే.. కష్టనష్టాల్లో తోడుంటాం’ అని అసంతృప్తులను కలుపుకుని పోయేలా , రేవంత్ ను రెచ్చగొట్టేలా అతని ప్రసంగాలు కొనసాగుతున్నాయి.
అంతిమంగా అధిష్టానం కోమటిరెడ్డి చర్యలను సమర్థించకపోయినా.. ఇక్కడ క్రమశిక్షణ కమిటీ కనీసం వార్నింగ్ కూడా ఇవ్వడం లేదంటే.. అతన్ని తక్కువ అంచనా వేయడం లేదనేది ఓ కోణమైతే.. చర్యల వల్ల మరింతగా చెలరేగిపోయే అవకాశం ఇవ్వడమని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.