Easy Rice Dishes: వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతలు మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో మసాలాలు, నూనె ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపులో.. మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే.. శరీరానికి చలువ చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వరి అన్నంతో చేసే కొన్ని సాంప్రదాయ వంటకాలు కడుపును చల్లబరచడమే కాకుండా.. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ 6 సులభమైన రైస్ డిషెస్ మీకు అద్భుతంగా పని చేస్తాయి. అవేంటంటే..
ముఖ్యమైన 6 రైస్ వంటకాలు:
1. పెరుగు అన్నం :
నార్త్ ఇండియాలో పెరుగు అన్నం లేనిదే భోజనం పూర్తి కాదు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ఇది నంబర్ వన్. మెత్తగా ఉడికించిన అన్నంలో పెరుగు, కొంచెం పాలు, పోపు వేసి పైన దానిమ్మ గింజలు లేదా ద్రాక్ష ముక్కలు కలిపితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
2. నిమ్మకాయ పులిహోర:
అన్నంలో నిమ్మరసం కలపడం వల్ల విటమిన్-సి లభిస్తుంది. ఇది ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గిస్తుంది. ఇది జీర్ణం కావడానికి చాలా సింపుల్. వేడి వేడి అన్నం కాకుండా చల్లారిన అన్నంతో దీన్ని చేసుకుంటే.. కడుపులో చాలా తేలికగా ఉంటుంది.
3. కొబ్బరి అన్నం:
కొబ్బరి పాలు లేదా తురిమిన పచ్చి కొబ్బరితో చేసే ఈ అన్నం శరీరానికి అమితమైన చలువను ఇస్తుంది. కొబ్బరిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. మసాలాలు లేకుండా కేవలం మిరియాలు, జీలకర్ర పోపుతో దీన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది.
4. గంజి అన్నం / చద్ది అన్నం:
మన పూర్వీకులు సమ్మర్‌లో ఎక్కువగా తినేది ఇదే. రాత్రి వండిన అన్నంలో నీళ్లు పోసి, మరుసటి రోజు ఉదయం అందులో కొంచెం పెరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.ఇది కడుపులోని చెడు బ్యాక్టీరియాను తొలగించి,పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
5. మామిడికాయ పులిహోర :
సమ్మర్ అంటేనే మామిడికాయల సీజన్. పచ్చి మామిడికాయలో ఉండే పులుపు ఎండ దెబ్బ తగలకుండా చూస్తుంది. ఇది నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా.. పిత్త దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది.
6. పుదీనా అన్నం:
పుదీనా సహజంగానే చలువ చేసే గుణం కలిగి ఉంటుంది.పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసి అన్నంలో కలిపి వండుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది. పుదీనా ఫ్లేవర్ మనసుకు కూడా ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంటుంది.
వేసవిలో భారీ భోజనాల కంటే ఇలాంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు రావు. పైన చెప్పిన ఆరు రకాల వంటకాలు తక్కువ సమయంలో.. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు.