Top 100 Iconic Ice Creams: ప్రపంచవ్యాప్తంగా ఉండే రకరకాల వంటకాలు, రుచుల గురించి చెప్పే పాపులర్ డిజిటల్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ తాజాగా ప్రపంచంలోని ‘100 మోస్ట్ ఐకానిక్ ఐస్‌క్రీమ్స్’ జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల డెజర్ట్‌ల కంటే.. ఎన్నో ఏళ్లుగా స్థానికులకు నోరూరిస్తున్న పాతకాలపు ఐస్‌క్రీమ్ షాపులకే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. విశేషం ఏమిటంటే.. ఈ వంద అత్యుత్తమ ఐస్‌క్రీమ్స్ జాబితాలో భారతదేశానికి చెందిన 5 ఐకానిక్ ఐస్‌క్రీమ్ బ్రాండ్లు చోటు సంపాదించుకున్నాయి. దేశంలోని విభిన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, తమదైన ప్రత్యేక రుచులతో ఇవి ఈ గుర్తింపును సాధించాయి.
ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో 1953 నుండి సేవలందిస్తున్న ‘కె. రుస్తుం అండ్ కో’ ఐస్‌క్రీమ్ పార్లర్ శైలి చాలా విభిన్నంగా ఉంటుంది. వీరు ఐస్‌క్రీమ్‌ను కోన్స్ లేదా స్టిక్స్‌పై ఇవ్వరు. తాజా మామిడి పండ్లతో చేసిన గడ్డలాంటి ఐస్‌క్రీమ్‌ను స్లైస్‌గా కట్ చేసి, రెండు క్రిస్పీ వేఫర్ బిస్కెట్ల మధ్య ఉంచి శాండ్‌విచ్‌లా అందిస్తారు. ముంబై వెళ్లే పర్యాటకులు దీన్ని అస్సలు మిస్ అవ్వరు.
బెంగళూరు వాసుల చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న పేరు ‘కార్నర్ హౌస్’. 1982లో ప్రారంభమైన ఈ పార్లర్‌లో లభించే ‘డెత్ బై చాక్లెట్’ అక్కడి వారందరికీ ఎంతో ఇష్టం. మెత్తటి చాక్లెట్ కేక్, వెనిలా ఐస్‌క్రీమ్, వేడివేడి చాక్లెట్ ఫడ్జ్ సాస్, పల్లీలు, విప్డ్ క్రీమ్‌లతో కలిపి పైన ఒక చెర్రీని ఉంచి ఇచ్చే ఈ డెజర్ట్ తింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Also Read: బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ట్రెండ్ రాకముందే.. 1975లో మంగళూరులోని ‘పబ్బాస్’ ఐస్‌క్రీమ్ పార్లర్ ఈ గడ్‌బడ్‌ను ఫేమస్ చేసింది. ఒక పొడవాటి గ్లాసులో రకరకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు, తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, జెల్లీలు, స్వీట్ సిరప్‌లను లేయర్లుగా వేసి కలర్‌ఫుల్‌గా ఇచ్చే ఈ ఐస్‌క్రీమ్ రుచి అద్భుతంగా ఉంటుంది.
ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వాడకుండా కేవలం తాజా పండ్లతో ఐస్‌క్రీమ్స్ తయారు చేయడంలో ‘నేచురల్స్’ బ్రాండ్ 1984 నుండి ఫేమస్. వీరి ఐకానిక్ ‘టెండర్ కోకోనట్’ ఫ్లేవర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. స్వచ్ఛమైన పాలతో పాటు కొబ్బరి ముక్కలు (కొబ్బరి మలై) నములుతుంటే ఆ మజానే వేరు.
ముంబైలోనే 1971లో మొదలైన ‘అప్సరా ఐస్‌క్రీమ్స్’ వీధి పక్కన దొరికే స్ట్రీట్ ఫుడ్ రుచిని ఐస్‌క్రీమ్‌లోకి తెచ్చింది. వీరి దగ్గర లభించే గువా (జామకాయ) ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ తింటే నిజంగానే ఉప్పు, కారం చల్లిన జామకాయ ముక్కను తిన్న అనుభూతి కలుగుతుంది.
ఈ జాబితా చూశాక హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కాస్త నిరాశ పడొచ్చు. ఎందుకంటే.. మన పాతబస్తీకి చెందిన ఐకానిక్ స్వీట్ షాపుల పేర్లు ఇందులో లేవు. కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముంబై, బెంగళూరు దాకా వెళ్లకుండానే ఈ ప్రపంచ స్థాయి ఐస్‌క్రీమ్స్ మన హైదరాబాద్‌లోనే టేస్ట్ చేయొచ్చు.
సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో నేచురల్స్, అప్సరా ఐస్‌క్రీమ్స్ అవుట్‌లెట్లు అందుబాటులో ఉన్నాయి. రాత్రిపూట భోజనం అయ్యాక ఇక్కడి షాపుల దగ్గర జనాలు క్యూ కడుతుంటారు. నేచురల్స్ టెండర్ కోకోనట్ ఐస్‌క్రీమ్ తింటూ కొబ్బరి ముక్కల మజాను, అలాగే అప్సరా జామకాయ ఐస్‌క్రీమ్‌పై కాస్త మసాలా చల్లించుకుని ఆ స్పైసీ అండ్ స్వీట్ కిక్‌ను మన సిటీలోనే ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: రెస్టారెంట్ స్టైల్ పనీర్ బటర్ మసాలా.. ఒక్కసారి తింటే ఈ రుచిని అస్సలు మర్చిపోలేరు!