Naatu Kodi Pulusu: మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎన్ని రెస్టారెంట్లు పుట్టుకొచ్చినా, కొత్తగా నాన్‌వెజ్ రెసిపీలను ఎన్ని పరిచయం చేసినా.. విలేజుల్లో వండుకునే నాటు కోడి పులుసుకు ఉన్న క్రేజు మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. అది కూడా ముక్క మెత్తగా, పులుసు ఘాటుగా ఉంటే ఆ రుచే వేరు కదా. ముఖ్యంగా ఆంధ్రా సైడ్ పండగలు, శుభకార్యాల సమయంలో చిట్టి గారెలు లేదా రాగి సంగటితో ఈ పులుసు కలిపి తింటుంటారు. మరి ఇప్పుడు సింపుల్‌గా, ఘుమఘుమలాడే నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా..
నాటు కోడి మాంసం – 500 గ్రాములు
ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరిగినవి)
పెద్దవి పచ్చిమిర్చి – నాలుగు నుంచి ఐదు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు
టమోటాలు – రెండు (తరిగినవి)
కారం – మూడు టేబుల్ స్పూన్లు
పసుపు – చిటికెడు
చికెన్ మసాలా – ఒక టేబుల్ స్పూన్
ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్
నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, కరివేపాకు – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
నాటు కోడి మాంసాన్ని పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. నాటు కోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి.. దీన్ని కుక్కర్‌లో ఉడికించుకుంటే ముక్క మెత్తగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి. నూనె కాగాక బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు శుభ్రం చేసిన మాంసాన్ని ఇందులో వేసి 5 నిమిషాల పాటు అధిక మంట మీద వేయించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
ముక్కలకు మసాలా బాగా పట్టిన తర్వాత, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టండి. నాటు కోడి కాబట్టి కనీసం 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పోయాక మూత తీసి, మళ్లీ స్టవ్ ఆన్ చేసి గరం మసాలా వేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరి.