Healthy Protein Cake: తీపి అంటే ఇష్టం ఉన్నా, ఫిట్‌నెస్, ఆరోగ్యం కోసం దానికి దూరంగా ఉండేవారికి ప్రోటీన్ కేక్ ఒక వరం లాంటిది. సాధారణంగా కేక్ అనగానే మైదా, పంచదార గుర్తుకు వస్తాయి. కానీ.. మనం ఇంట్లోనే ఓవెన్ లేకపోయినా, ఎలాంటి హానికర చక్కెరలు వాడకుండా అత్యంత పోషక విలువలతో కూడిన కేక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను, శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేవారికి, షుగర్ పేషెంట్లకు బెస్ట్ స్నాక్.
కావలసిన పదార్థాలు:
ఓట్స్ పిండి : 1 కప్పు (ఓట్స్‌ను మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి)
ప్రోటీన్ పౌడర్: 1-2 స్కూప్స్ (చాక్లెట్ లేదా వెనీలా ఫ్లేవర్)
పండిన అరటిపండ్లు: 2
ఖర్జూరాల పేస్ట్: అర కప్పు
కోకో పౌడర్: 2 టేబుల్ స్పూన్లు
గుడ్లు: 2
బేకింగ్ పౌడర్: 1 టీస్పూన్
వెనీలా ఎసెన్స్: కొన్ని చుక్కలు
పాలు లేదా బాదం పాలు: పిండి కలపడానికి తగినంత
తయారీ విధానం:
1.ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో పండిన అరటిపండ్లను తీసుకుని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులోనే ముందుగా నానబెట్టి మిక్సీ పట్టిన ఖర్జూరాల పేస్ట్‌ను కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం కేక్‌కు అవసరమైన సహజ సిద్ధమైన తీపిని అందిస్తుంది.
2.ఈ మిశ్రమంలో గుడ్లు (లేదా పెరుగు), వెనీలా ఎసెన్స్ వేసి బాగా గిలక్కొట్టాలి. మిశ్రమం మొత్తం ఒకేలా ఉండేలా చూసుకోవాలి.
3. మరొక గిన్నెలో ఓట్స్ పిండి, ప్రోటీన్ పౌడర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్‌ను కలిపి జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వల్ల కేక్ ఉండలు కట్టకుండా మెత్తగా వస్తుంది.
4. ఇప్పుడు పొడి మిశ్రమాన్ని నెమ్మదిగా మిశ్రమంలో పోస్తూ కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే కొద్దిగా పాలు పోస్తూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. కేక్‌ను మరీ ఎక్కువగా కలపకూడదు. దీనివల్ల కేక్ గట్టిపడుతుంది.
5. ఓవెన్ ఉంటే: 180°C వద్ద ప్రీ-హీట్ చేసిన ఓవెన్‌లో 25-30 నిమిషాల పాటు బేక్ చేయాలి.
ఓవెన్ లేకపోతే: ఒక మందపాటి గిన్నెలో ఇసుక లేదా ఉప్పు వేసి, దానిపై స్టాండ్ ఉంచి 10 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత కేక్ పాత్రను అందులో ఉంచి తక్కువ మంటపై 30-40 నిమిషాలు ఉడికించాలి.
6. ఒక టూత్‌పిక్ లేదా చాకును కేక్ మధ్యలో గుచ్చి చూడండి. అది శుభ్రంగా బయటకు వస్తే కేక్ రెడీ అయినట్లే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాతే ముక్కలుగా కోయాలి.
ఈ కేక్ వల్ల ప్రయోజనాలు:
బరువు తగ్గడం: మైదా లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు.
కండరాల పుష్టి: ప్రోటీన్ పౌడర్, ఓట్స్ కండరాల మరమ్మతుకు సహాయపడతాయి.
జీర్ణక్రియ: ఓట్స్, అరటిపండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.