The Odyssey Review: సాధారణంగా హాలీవుడ్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు క్రిస్టోఫర్ నోలన్. సైన్స్ ఫిక్షన్ తో ఆడియన్స్ మైండ్ బ్లాంక్ చేసిన ఈ ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్.. ఇప్పుడు గ్రీక్ మైథాలజీతో థియేటర్ల మీద దండయాత్ర చేశాడు. 3వేల ఏళ్ల క్రితం నాటి కథను పట్టుకొని.. దానికి నోలన్ మార్క్ మాస్ ఎలివేషన్స్ యాడ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించలేము. థియేటర్లలో ఇక పూనకాలే.. అదే ‘ది ఒడిస్సీ’. ఈ అరాచకమైన సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను దడదడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు జూలై 17న థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం..
దాదాపు పది సంవత్సరాలుగా సాగుతున్న ట్రోజన్ యుద్ధానికి ముగింపు పలుకుతూ.. ట్రోజన్ వార్ లో ట్రాయ్ రాజ్యాన్ని తన తెలివితేటలతో ఓడిస్తాడు ఒడిస్సియస్(మాట్ డామన్). అనంతరం సైన్యంతో కలిసి తన రాజ్యం ఇథాకాకు సముద్ర మార్గం ద్వారా పయనం అవుతాడు. అతడి రాక కోసం భార్య పెనెలోప్ (అన్నీ హాథవే ) , కొడుకు టెలిమాకస్ (టామ్ హాలెండ్) ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఒడిస్సియస్ ఎప్పటికీ రాడని, ఆ రాజ్యాన్ని , ఆ రాజ్య రాణిని వశం చేసుకోవడానికి.. తనను వివాహం చేసుకోవాలని పెనెలోప్ ను ఆంటినస్(రాబర్ట్ పాటిన్సన్) ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా తన మాయదారి మోసపు మాటలతో ఆమెను వశం చేసుకోవాలని రోజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు . అయితే పది రోజుల్లో ఇథికాకు చేరుకోవాల్సిన ఒడిస్సియస్ కు సముద్ర ప్రయాణంలో ఎలాంటి ఆపదలు వచ్చాయి? సముద్రంలో రాక్షసులను, దేవుళ్ళ కోపాన్ని, తుఫానులను ఎదుర్కొని ఒడిస్సియస్ ఎలా తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు? దారి తప్పిన ఒడిస్సియస్ మళ్లీ భార్య, కొడుకు దగ్గరికి ఎలా చేరుకున్నాడు ? రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న వారి ప్రయత్నాలు ఎంతవరకు సాగాయి? అనేది వీర లెవెల్ సర్వైవల్ స్టోరీ.
సాధారణంగా రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, మంత్రాలు, మాయలు, రాక్షసులు మన వెండితెరకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఎన్నో ఇతిహాస పురాణగాథలు మన ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక తాజాగా విడుదలైన గ్రీకు పురాణగాథ ది ఒడిస్సీ కూడా అదే కోవకు చెందింది. భార్యాబిడ్డల్ని కలుసుకునేందుకు తన రాజ్యానికి పయనమైన ఒక రాజు చేసే సంక్లిష్ట ప్రయాణమే ఈ సినిమా కథ. ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు చాలా సన్నివేశాలకు మూలం మన పురాణగాథల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఇలాంటి కథలు చెప్పేటప్పుడు దర్శకుడికి రెండు మార్గాలు ఎప్పుడూ ఉంటాయి. ఒకటి ఉన్నది ఉన్నట్లు చెప్పడం.. అంటే దీనివల్ల ప్రతి సన్నివేశం మనం ఎక్కడో చూసామనే ఫీలింగ్ కలుగుతుంది.అందులో కొత్తదనం ఉండదు. కానీ ఎప్పుడైతే కథకు నాటకీయత జోడించడం జరుగుతుందో.. ఆ కథ ఖచ్చితంగా ప్రేక్షకుడి హృదయానికి చేరుకుంటుంది. డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ చేసింది కూడా అదే..
మాట్ డామన్.. ఒడిస్సియస్ పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు అనడం కంటే కూడా ఒకవేళ ఒడిస్సియస్ ఉంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా పాత్రకు ప్రాణం పోశాడు. ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా క్లిష్టమైన పాత్రకు అవసరమైన హావ భావాలను, భావోద్వేగాలను చాలా గొప్పగా పలికించాడు. ఒకరకంగా చెప్పాలి అంటే.. ఆయన కెరియర్లో ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అని చెప్పవచ్చు. ఇక రాణి పాత్రలో పెనెలోప్ గా అన్నీ హథవే, స్పైడర్ మాన్ కుర్రోడు టామ్ హాలెండ్ కొడుకు పాత్రలో ఆకట్టుకున్నారు. ఇలా ఎవరికి వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక నటీనటులలో ఏకైక భారతీయుడైన హిమేష్ పటేల్, ఒడిస్సియస్ రెండో కమాండర్ గా తరచూ అయోమయానికి గురయ్యే పాత్రకు సరైన ఎంపిక అనిపించింది.
మంత్రగత్తె సిర్సీ పాత్రలో సమంత మోర్టన్ తో పాటు ఎవరికి వారు తమ పాత్రలతో చక్కగా ఆకట్టుకున్నారు. ఇక బ్యాట్ మ్యాన్ చిత్రంలో హీరోగా చేసిన రాబర్ట్ పాటిన్సన్ ఈ సినిమాలో విలన్ గా కిరాతకత్వం చూపించాడు. నెగిటివ్ రోల్ లో స్క్రీన్ మీదకు వస్తే ఆడియన్స్ భయంతో ఊగిపోతారు. కరుడుగట్టిన విలనిజం అంటే ఇదే అని కచ్చితంగా చూపించారు.
విజువల్ వండర్ సినిమా ఇది. ఈ సినిమాకి అసలైన హీరో కెమెరామెన్ “హొయ్టే వన్ హొయ్టెమా”. ఐమ్యాక్స్ 70 ఎంఎం కెమెరాలతో ఏకంగా మూడు గంటల పాటూ సినిమా తీసి రికార్డు సృష్టించాడు. ఆ రాక్షస అలలు, కళ్ళు తిరిగే సుడిగుండాలు, కళ్ళ మధ్య కనిపిస్తుంటే థియేటర్ సీట్లోంచి ఎగిరి గంతేయడం ఖాయం. ఇక లుడ్విగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మళ్ళీ ఆస్కార్ కొట్టడం గ్యారెంటీ.. సైలెంట్గా మొదలై క్లైమాక్స్ లో థియేటర్స్ స్పీకర్లు పగిలిపోయేలా చాలా అద్భుతంగా బిజీఎమ్ ఇచ్చాడు.
నటీనటుల పర్ఫామెన్స్
కథ , స్క్రీన్ ప్లే
దర్శకుడు సినిమాను తీర్చిదిద్దిన తీరు
సాంకేతిక బృందం పనితీరు
సన్నివేశాల్లో సహజత్వం
మొదటి భాగంలో కథ కాస్త నెమ్మదిగా వెళ్లడం
సాగదీసిన ఫీలింగ్ కలగడం
ది ఒడిస్సీ.. కేవలం సినిమా కాదు ఒక విజువల్ గ్రాండియర్ ఒక మామూలు మైథాలజీ కథను కూడా తన విజన్ తో అద్భుతంగా మార్చగల సత్తా నోలన్ కే ఉందని ఈ సినిమా మళ్లీ నిరూపించింది. హాలీవుడ్ యాక్షన్ ఫాంటసీ ఇష్టపడే వాళ్ళకి ఇది కచ్చితంగా పండగే. ముఖ్యంగా దీనిని మొబైల్ లో కాకుండా థియేటర్లో.. అది కూడా ఐమాక్స్ లోనే చూసి తీరాల్సిన అరాచకమైన సినిమా ఇది. అంతేకాదు 2000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.2500 కోట్లు కొల్లగొడుతుందని సినీ వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
రేటింగ్: 3/5
ALSO READ:బిగ్ బాస్ దశావతారంపై బిగ్ అప్డేట్.. ఆ రోజే షో ప్రారంభం!