పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే సమయంలో మనిషి మెదడు ఎలా ప్రవర్తిస్తుంది?
కొత్త విషయాలను అవగాహన చేసుకునే సమయంలో మెదడు ఎలా పనిచేస్తుంది?
అసలు మెదడు చురుగ్గా వ్యవహరించేది ఎప్పుడు, మైండ్ బ్లాక్ అయ్యే సందర్భాలు ఎప్పుడొస్తాయి?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొనే క్రమంలో ఏ అద్భుతమైన పాయింట్ ని ఆవిష్కరించారు శాస్త్రవేత్తలు. మనిషి మెదడు మన ఆలోచనలకు అనుగుణంగా కొంత కాంతిని బయటకు ప్రసరింపజేస్తుందని గుర్తించారు. ఆ కాంతి పుర్రె ద్వారా వస్తుందని కనుగొన్నారు. మెదడు పర్యవేక్షణలో ఇది ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరిస్తుందని అంటున్నారు నిపుణులు.
ఫొటోఎన్సెఫలోగ్రఫీ
మెదడు కాంతిని ప్రసరింపజేసే దృగ్విషయాన్ని ఫొటోఎన్సెఫలోగ్రఫీ అంటారు. మానవుని మెదడు పుర్రె ద్వారా వెళ్ళగల మందమైన కాంతి సంకేతాలను విడుదల చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇవి మానసిక కార్యకలాపాలకు ప్రతిస్పందనలేనని తేల్చారు. ఐసైన్స్ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. వీటిని అల్ట్రావీక్ ఫోటాన్ ఉద్గారాలు (UPEలు) అంటారు. UPEలు సాధారణ జీవక్రియ సమయంలో సంభవించే సహజ కాంతి ఉద్గారాలు. ఇలాంటి ఉదాహరణే మనకు మిణుగురు పురుగుల విషయంలో ఎదురవుతుంది. అయితే ముణుగురు పురుగుల్లో బయోలుమినిసెన్స్ ద్వారా కాంతి వెలువడుతుంది. మానవునిలో కాంతికి కారణం అయ్యే UPEలు ప్రత్యేకమైన ప్రకాశించే రసాయనాలపై ఆధారపడవు. సాధారణ దృశ్య కాంతి కంటే ఇవి మిలియన్ రెట్లు మందంగా ఉంటాయి.
మానవుని మెదడు నుండి వెలువడే ఈ కాంతి సంకేతాలు నిరంతరం జీవ కణజాలం ద్వారా ఉత్పత్తి చేయబడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మెదడు ఆరోగ్యం, చురుకుదనం, ఇతర కార్యకలాపాలపై కూడా ఇవి ఆధారపడతాయని అంటున్నారు. అల్గోమా యూనివర్శిటీ, టఫ్ట్స్ యూనివర్శిటీ, విల్ఫ్రిడ్ లారియర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ ప్రయోగాలు చేపట్టింది. పూర్తిగా చీకటిలో ఉన్న 20 మందిపై ఈ అధ్యయనం చేసింది. మెదడు తరంగాలను ట్రాక్ చేయడానికి పుర్రెపై సెన్సిటివ్ సెన్సార్లు, EEG క్యాప్‌లను ఉపయోగించారు. వాటి ద్వారా మెదడు నుంచి వెలువడే కాంతి ఉద్గారాలను రికార్డ్ చేశారు. కళ్లు మూసుకుంటే ఒకలా, శబ్దాలకు ప్రతిస్పందిస్తే మరోలా ఈ కాంతి వెలువడుతోందని గ్రహించారు. ఆయా ప్రక్రియలు జరిగే సమయంలో కాంతి ప్రసరణలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నట్టు గుర్తించారు. మానవుడి మానసిక స్థితి ఆధారంగా ఈ కాంతి తరంగాలు పలు మార్పులకు లోనయ్యాయి.
మెదడును నిష్క్రియాత్మకంగా అధ్యయనం చేయడానికి ఈ కాంతి తరంగాలు ఉపయోగపడతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తు సాంకేతికతలకు ఈ పరిశోధన మార్గాన్ని సుగమం చేస్తుందని చెబుతున్నారు. నాడీ సంబంధిత వ్యాధుల నిర్థారణ, ట్రాకింగ్ లో కూడా ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. మనిషి మెదడుపై ఇప్పటి వరకు చాలా పరిశోధనలు జరిగాయి కానీ, పూర్తి స్థాయిలో ఏదీ సత్ఫలితాలను ఇవ్వలేదు. అయితే కొన్నిసార్లు ఈ పరిశోధన ఫలితాలు, సరికొత్త విషయాలను అవగాహన చేసుకోడానికి ఉపయోగపడతాయి. తాజాగా జరిగిన పరిశోధన కూడా అలాంటిదే. మనిషి మెదడు నుంచి కాంతి తరంగాలు విడుదలవుతాయనే అధ్యయన ఫలితం ఈ పరిశోధనల్లో అతి పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.