Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో విజయం కోసం పార్టీలు సరికొత్తగా ప్రచారం చేస్తు్న్నాయి. తాజాగా ఆటో డ్రైవర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆటోల్లో ప్రయాణిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడ, రెహమత్ నగర్ లాంటి ఏరియాల్లో ఆటో డ్రైవర్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆటో డ్రైవర్ల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉచిత బస్సు పథకాన్ని సాకుగా చూపి ఆటో డ్రైవర్ల ఓట్ల కోసం ప్రయత్నిస్తుంటే.. గత 10 ఏళ్లలో ఆటో డ్రైవర్లకు ఏం చేశారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది.
గత ప్రభుత్వం 10 ఏళ్లల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశారని విమర్శలు వస్తున్నాయి. అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలం ఆటో డ్రైవర్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నారనే మాటలు నియోజవవర్గంలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకుంటుందని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రకటించింది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో డ్రైవర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడకు చెందిన మష్రత్ అలీ అనే ఆటోవాలా ఆటోలో కేటీఆర్ ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డుమీద పడేసిందని కేటీఆర్ ఆరోపిస్తు్న్నారు. 2023 ఎన్నికల సమయంలో మష్రత్ అలీకి రెండు ఆటోలు ఉండేవని, ఇప్పుడు ఆ రెండు అమ్మేసి అద్దె ఆటో నడుపుకుంటున్నాడని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఆటోవాలా ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మంత్రి సీతక్క, ఉమెన్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బోరబండలో ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ తో మాట్లాడి చేయి గుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తామని ఆటో డ్రైవర్ చెప్పారని మంత్రి సీతక్క అన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని,
మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గల్లీలకు ఆర్టీసీ బస్సులు రావని మంత్రి సీతక్క అన్నారు.
చిన్న చిన్న దూరాలకు ప్రజలు ఆటోలనే ఆశ్రయిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆటో డ్రైవర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. స్వయంగా కేసీఆర్ ప్రగతి భవన్లోనే ఓలా, ఉబర్ బైక్ సర్వీసులను కేటీఆర్ ప్రారంభించి ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీశారన్నారు. నో పార్కింగ్, ఫిట్మెంట్ ఛార్జీలు పేరుతో ఆటో డ్రైవర్ల జేబులకు చిల్లులు పెట్టారని గుర్తుచేశారు. తమ బాధలు చెప్పుకుందామంటే ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారని సీతక్క ఆరోపించారు. కేసీఆర్ నివాసం ప్రగతి భవనం ముందే ఆటో డ్రైవర్ తన ఆటో తగలబెట్టుకున్నారని గుర్తుచేశారు.
కేసీఆర్ పదెండ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో ఒక్క కొత్త ఆటోకు అనుమతులు ఇవ్వలేదని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఆటో డ్రైవర్ల పట్ల మోసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తమ తల్లికి చెల్లికి ఉచిత బస్సు ప్రయాణం లభిస్తుందని ఆటోడ్రైవర్లు చెబుతున్నారన్నారు. ఉచిత కరెంట్, సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఆటో డ్రైవర్ల మహిళా కుటుంబ సభ్యులకు ద్వారా ఎన్నో సంక్షేమాలను అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. తమ బాధలను ప్రపంచ బాధలుగా చెప్పడం కేసీఆర్ కుటుంబానికి అలవాటే అని ఎద్దేవా చేశారు.
Also Read: Jupally Krishna Rao: తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తా: మంత్రి జూపల్లి కృష్ణారావు
అధికారం పోయే సరికి కేటీఆర్ అన్ని వర్గాల మీద ప్రేమ కురిపిస్తున్నారన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరిని కూడా పట్టించుకోలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు.