AI Reduce Population| టెక్నాలజీ రంగంలో అత్యాధునిక విప్లవం కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఏఐ). ఈ రోజుల్లో ప్రతి ఎలెక్ట్రానిక్ ఉపకరణంలో ఏఐ ఫీచర్లు జోడించడానికి కంపెనీలు పోటీపడుతున్నాయి. అయితే ఏఐని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయకపోతే మానవ జాతికి ప్రమాదకరం. ఆటోమేషన్ వల్ల ఉద్యోగ నష్టం, నిఘా దుర్వినియోగం, తప్పుడు సమాచార వ్యాప్తి, పక్షపాత నిర్ణయాలు సంభవించవచ్చు. భవిష్యత్తులో పవర్ ఫుల్ ఏఐ వ్యవస్థలు నియంత్రణ తప్పి, మానవాళికి వ్యతిరేకంగా పనిచేస్తాయని చాలా కాలంగా నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సూపర్‌ఇంటెలిజెంట్ AI మానవ భద్రత కంటే తన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రమాదముందని వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సీనియర్ కంప్యూటర్ సైన్స్ నిపుణుడు తీవ్రంగా హెచ్చరించారు. ఏఐ వల్ల ప్రపంచ జనాభా అంతం అయ్యే ప్రమాదముందని ఆయన షాకింగ్ విషయాలు వెల్లడించారు.
అమెరికాలోని ఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ అయిన సుభాష్ కాక్ ఒక ఆశ్చర్యకరమైన హెచ్చరిక చేశారు. 2300 సంవత్సరానికి భూమిపై జనాభా ప్రస్తుత 800 కోట్ల నుండి కేవలం 10 కోట్లకు పడిపోతుందని ఆయన అంచనా వేశారు. దీనికి కారణం అన్ని రంగాల్లో విస్తరిస్తున్న కృత్రిమ మేధస్సు (AI) అని ఆయన చెప్పారు. ఈ పతనం సినిమాల్లో చూపించే అణు యుద్ధం వల్ల కాదు కానీ.. మనుషులు చేసే ఉద్యోగాలను ఏఐ ఆక్రమించడం వల్లేనని ఆయన తెలిపారు.
“సమాజానికి, ప్రపంచానికి ఏఐ వినాశకరంగా ఉంటుంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేదు,” అని కాక్ న్యూయార్క్ పోస్ట్‌తో అన్నారు. “కంప్యూటర్లు లేదా రోబోలు ఎన్నటికీ మనలాగా స్పృహ కలిగి ఉండవు, కానీ మనం చేసే దాదాపు అన్ని పనులను అవి చేయగలవు,” అని ఆయన వివరించారు.
‘ఏజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ పుస్తక రచయిత అయిన కాక్, ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే భయంతో ప్రజలు పిల్లలను కనడానికి వెనుకాడతారని, దీనివల్ల జనన రేటు తగ్గి, జనాభా భారీగా క్షీణిస్తుందని హెచ్చరించారు. “డెమోగ్రాఫర్లు (జనాభా శాస్త్ర నిపుణులు) కూడా ఏఐ కారణంగా 2300 లేదా 2380 నాటికి భూమిపై జనాభా కేవలం 10 కోట్లకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు,” అని ఆయన అన్నారు.
యురోప్, చైనా, జపాన్, దక్షిణ కొరియాలో ఇటీవల జనాభా క్షీణత స్పష్టంగా కనిపిస్తోందని.. ఈ ధోరణి కొనసాగవచ్చని కాక్ ఉదాహరణలతో వివరించారు. “ఈ ధోరణులు కొనసాగుతాయని నేను చెప్పడం లేదు, కానీ వీటిని మార్చడం చాలా కష్టం. ప్రజలు వివిధ కారణాల వల్ల పిల్లల కనడానికి ఆలోచిస్తున్నారు. ఆర్థిక భద్రతతో ముడిపడి ఉండడంతో ఉద్యోగాలు ఒక ప్రముఖ కారణం,” అని ఆయన అన్నారు.
ఏఐతో ఉద్యోగాలకు ప్రమాదం
కాక్ హెచ్చరికను ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ కూడా సమర్థించారు. రాబోయే ఐదేళ్లలో 50 శాతం ఎంట్రీ లెవెల్ వైట్-కాలర్ ఉద్యోగాలు ఏఐ వల్ల తొలగిపోవచ్చని ఆయన అన్నారు. “మేము ఈ సాంకేతికతను సృష్టించాం. అందుకే రాబోయే పరిణామాల గురించి నిజాయతీగా చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. దీని గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు,” అని అమోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ ముప్పును తక్కువగా అంచనా వేస్తున్నాయని ఆయన చెప్పారు.
Also Read: 10 లక్షల ఉద్యోగాలు.. 2026 నాటికి ఏఐ రంగంలో దేశవ్యాప్తంగా భారీ డిమాండ్
“చాలా ప్రభుత్వాలకు ఇది జరగబోతోందని తెలియదు. ఇది వింతగా అనిపిస్తుంది, ప్రజలు నమ్మడం లేదు,” అని అమోడీ అన్నారు. అమెరికా ప్రభుత్వం కూడా, కార్మికుల నుండి వచ్చే వ్యతిరేకత లేదా చైనాతో AI పోటీలో వెనుకబడిపోతామనే భయంతో ఈ విషయంపై నిశ్శబ్దంగా ఉందని ఆయన విమర్శలు చేశారు.