Sana Yousuf: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్ దారుణ హత్యకు గురైంది.ఆమె నివాసంలో ఈ దారుణం చోటు చేసుకుంది. దగ్గర బంధువు ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఆమెను చూడటానికి వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక పరువు హత్య ఉండవచ్చనే అనుమానాలు లేకపోలేదు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసుఫ్ గురించి చెప్పనక్కర్లేదు. కంటెంట్ క్రియేటర్ కూడా. ఈమెకి దీనికి సంబంధించి పెద్ద టీమ్ ఉంది. పాకిస్తాన్‌లో బాగా పాపులర్. ఈమె వీడియోలకు దాయాది దేశంలో యమ క్రేజ్. చిన్నారుల నుంచి పెద్దల వరకు చూస్తుంటారు. దాదాపు నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ ఆమె సొంతం.
ఏం జరిగింది తెలీదుగానీ మంగళవారం ఉదయం సనా యూసుఫ్‌ని ఇంటికి సమీపంలో ఓ వ్యక్తి ఆమెని కాల్చి చంపాడు. నిందితుడు దగ్గర బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన పాకిస్థాన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
అప్పర్ చిత్రాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి సనా యూసుఫ్. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో ఉంటుంది. తక్కువ సమయంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా అడుగులు వేయడంలో ఈమెకి తిరుగులేదని అంటుంటారు అక్కడి ప్రజలు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేది కూడా. మంగళవారం ఉదయం సనాను కలవడానికి ఓ వ్యక్తి ఇంటికి వచ్చాడు.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు స్పాట్‌లో మృతి
ఇంటి బయట సనాతో కొంతసేపు మాట్లాడాడు. ఆమె ఇంట్లోకి వెళ్లే సమయంలో తనతో తెచ్చుకున్న తుపాకితో ఆ వ్యక్తి పలుమార్లు కాల్పులు జరిపాడు. ఘటన తర్వాత అక్కడి నుంచి పారయ్యాడు. సనా శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడంతో స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా వెల్లడించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సనా ఇంటికి చేరుకున్నారు. సనా బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. సనా ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ చెక్ చేశారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ హత్య వెనుక అనేక కోణాలు ఉండవచ్చని ప్రచారం సాగుతోంది.
పరువు హత్యల కోణంలో విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీస్ అధికారి చెప్పారు. ఈ విషయాన్ని పాక్ మీడియా తెలిపింది. పాకిస్థాన్‌లోని ఓ సామాజిక కార్యకర్త కుమార్తె సనా యూసుఫ్. తన వీడియోల ద్వారా రోజువారీ జీవనశైలి, చిత్రాల్ సంస్కృతి, మహిళల హక్కులు, విద్య ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కల్పించేది. యువతకు ప్రేరణ కలిగించే కంటెంట్‌ను రూపొందించేది.