AI Tech Jobs| భారతదేశంలో 2026 నాటికి 10 లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిపుణుల అవసరం ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో తెలిపింది. ఈ నివేదిక, ‘ఇండియాస్ ఏఐ రెవల్యూషన్త్: వికసిత్ భారత్‌కు రోడ్‌మ్యాప్’ అనే పేరుతో టైమ్స్ ఆఫ్ ఇండియా లో ప్రచురితమైంది. 2047 నాటికి భారత్‌ను 23-35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే దీర్ఘకాలిక లక్ష్యంలో ఈ వ్యూహం కీలక భాగం.
ఈ స్థాయిలో ఉద్యోగుల కొరత తీర్చేందుకు ఇంజనీరింగ్ విద్య కీలకంగా మారింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ప్రకారం.. 2024-25 విద్యా సంవత్సరంలో బిటెక్ (B.Tech) సీట్ల సంఖ్య 14.9 లక్షలకు చేరింది. ఇది గత నాలుగు సంవత్సరాలలో 16 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్ వంటి రంగాలలో 50 శాతానికి పైగా వృద్ధి. ఈ రంగాలు ఇప్పుడు భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి.
విద్యా విధానంలో కూడా ఈ ఏఐ టెక్నాలజీ విప్లవ మార్పులను తీసుకొస్తోంది. విద్యా సంస్థలు ఇప్పుడు బహుళ-విభాగాలను కలిపిన, పరిశ్రమలతో సమన్వయం చేసిన పాఠ్యాంశాలను అవలంబిస్తున్నాయి. సాంప్రదాయ STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) నుండి STEAM (ఆర్ట్స్‌ను జోడించడం) వైపు మార్పు జరుగుతోంది. దీని ద్వారా క్రియేటివిటీ, కమ్యూనికేషన్, చట్టపరమైన లేదా వ్యాపార నైపుణ్యాలను సాంకేతిక నైపుణ్యంతో కలిపి విద్యార్థులలో పెంపొందించడం జరుగుతుంది.
2024 ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం.. 2025 నాటికి భారత ఏఐ రంగం విలువ 28.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 45 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)తో ముందుకు సాగుతుందని అంచనా. సింగపూర్, ఫిన్లాండ్, ఐర్లాండ్, కెనడా దేశాలతో పోటీపడుతూ భారత దేశం కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏఐ (AI) నైపుణ్య కేంద్రాలలో ఒకటిగా నిలిచింది. 2016 నుండి 2023 వరకు AI నైపుణ్యం కలిగిన నిపుణుల సంఖ్య 14 రెట్లు పెరిగింది.
Also Read: పాత ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్.. ఇక వాట్సాప్ పనిచేయదు..
ఏఐ రంగంలో డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ.. ఇటీవలే SRM గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ (రామాపురం, చెన్నై, తిరుచిరాపల్లి) డైరెక్టర్ డాక్టర్ కతిరవన్ కన్నన్ మీడియతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. “ఏఐ నిపుణుల డిమాండ్ వేగంగా పెరగడానికి సాంకేతిక పురోగతి ప్రధాన కారణం” అని అన్నారు. “SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మేము మెడికల్ ఇంజనీరింగ్, ECE విత్ డేటా సైన్స్, AI-ML ఎంబెడెడ్ సిస్టమ్స్ వంటి బహుళ-విభాగాల పాఠ్యక్రమాలను అందిస్తున్నాము. పరిశ్రమలతో మా బలమైన సహకారం విద్యార్థులకు వాస్తవ ప్రపంచ అనుభవాన్ని, గ్లోబల్ పోటీతత్వాన్ని అందిస్తుంది,” అని ఆయన మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు.
అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖ రోడ్‌మ్యాప్ ప్రకారం.. విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు AI పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ విద్యను మార్చుకోవాలని సూచిస్తోంది. ఇది భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇంకా, సాంకేతిక విద్యలో ఆవిష్కరణలు, ఎథికల్ ఏఐ డిజైన్‌ను చేర్చడం ద్వారా స్థిరత్వం, సమ్మిళితం, గ్లోబల్ టెక్ రంగంలో నాయకత్వాన్ని పెంపొందించాలనే జాతీయస్థాయి వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ముందుసాగుతున్నట్లు పేర్కొంది.