iPhone 14: మనం ఎంతో ఇష్టపడి వేలకు వేలు పోసి కొన్న కొత్త ఫోన్‌లో సమస్యలు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఐఫోన్ లాంటి ఖరీదైన ఫోన్ కొన్నప్పుడు వారంటీ ఉన్నా సరే సర్వీస్ సెంటర్ వాళ్లు చుక్కలు చూపిస్తే ఎవరికైనా కోపం వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితే ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వినియోగదారుడికి ఎదురైంది. రిపేర్ కోసం ఏకంగా రూ.79,000 కట్టాలని డిమాండ్ చేసిన యాపిల్ సర్వీస్ సెంటర్‌కు వినియోగదారుల కోర్టు గట్టిగానే బుద్ధి చెప్పింది. అసలు ఆ ఫోన్ కథేంటి, కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌కు చెందిన ‘ఓం ఫోటో ఫ్రేమ్’ సంస్థ 2023 ఫిబ్రవరి 19న కొత్త ఐఫోన్ 14 కొనుగోలు చేసింది. అయితే ఫోన్ కొన్న కేవలం మూడు రోజులకే డిస్‌ప్లేలో సమస్య రావడంతో సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పుడు యాపిల్ కేర్ సిబ్బంది దాన్ని పరిశీలించి ఫిబ్రవరి 22న కొత్త ఫోన్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఇచ్చారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత నవంబర్‌లో ఆ కొత్త ఫోన్‌లో స్పీకర్ పనిచేయకపోవడం, ఫోన్ విపరీతంగా వేడెక్కడం లాంటి సమస్యలు మొదలయ్యాయి.
వారంటీ ఇంకా ఉండటంతో కస్టమర్ మళ్లీ పానిపట్‌లోని యాపిల్ సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించాడు. మొదట వారంటీ కింద ఫ్రీగా రిపేర్ చేస్తామని చెప్పిన సిబ్బంది.. తర్వాత ఫోన్‌ను బెంగళూరు పంపించారు. కొద్దిరోజుల తర్వాత మైక్రోఫోన్ మెష్ డ్యామేజ్ అయిందని, దాన్ని బాగు చేయాలంటే ఏకంగా రూ.79,000 కట్టాలని షాక్ ఇచ్చారు. కస్టమర్ ఎంత బతిమలాడినా సర్వీస్ సెంటర్ వాళ్లు వినలేదు. చివరికి రూ.42,900 కడితే రిపేర్ చేస్తామని ఆఫర్ ఇవ్వడంతో విసిగిపోయిన బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.
Also Read: దుప్పటి కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారా? వింటర్ సీజన్లో ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా!
విచారణ సమయంలో కస్టమర్ ఫోన్‌ను సరిగ్గా వాడకపోవడం వల్లే డ్యామేజ్ అయిందని యాపిల్ వాదించింది. అందుకే వారంటీ వర్తించదని చెప్పుకొచ్చింది. కానీ ఫోన్‌లో వచ్చిన సమస్య తయారీ లోపం కాదని నిరూపించే ఎలాంటి టెక్నికల్ రిపోర్టును యాపిల్ కోర్టుకు సమర్పించలేకపోయింది. కస్టమర్ నిర్లక్ష్యం ఉందని చెప్పడానికి కూడా సరైన ఆధారాలు చూపలేకపోయింది.
అన్ని రికార్డులు పరిశీలించిన వినియోగదారుల కమిషన్ యాపిల్ సేవల్లో లోపం ఉందని తేల్చి చెప్పింది. తీర్పు వచ్చిన 45 రోజుల్లోగా ఆ iPhone 14ను పూర్తిగా ఉచితంగా రిపేర్ చేసి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాకుండా.. కస్టమర్ పడిన మానసిక వేదనకు, కోర్టు ఖర్చులకు గాను రూ.5,500 పరిహారం చెల్లించాలని యాపిల్ సంస్థకు స్పష్టం చేసింది.
Also Read: కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?