స్మార్ట్ వాచ్ తో ఎన్నో లాభాలున్నాయి. మన తిండి, నడక, వ్యాయామం.. ఇలా అన్నిట్నీ లెక్కగట్టి విశ్లేషిస్తుంది. గుండె చప్పుడు, బ్లడ్ ప్రెషర్ లాంటి వాటిని గుర్తించి మనల్ని అలర్ట్ చేస్తుంది. అబ్బో ఒకటేంటి చాలా పనులే చేసి పెడుతుంది స్మార్ట్ వాచ్. అలాంటి స్మార్ట్ వాచ్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడిస్తే ఇంకెన్ని అద్భుతాలో చేయొచ్చు కదా. యాపిల్ కంపెనీ అదే చేసింది. యాపిల్ స్మార్ట్ వాచ్ లో కొత్తగా ఒక ఏఐ టూల్ ని ప్రవేశపెట్టింది. ఆ ఏఐ టూల్ తో చాలా ఉపయోగాలున్నాయి. అందులో ఒకటి ప్రెగ్నెన్సీ టెస్ట్. అవును, ఇది నిజం. యాపిల్ వాచ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయగలదు. అది కూడా 92 శాతం కచ్చితత్వంతో రిజల్ట్ చెప్పగలదు.
ఏఐతో ఎలా..?
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి. హార్ట్ బీట్ తో మొదలుకొని, వారి శరీరంలో అంతర్గత మార్పులు చాలానే చోటు చేసుకుంటాయి. వీటన్నిట్నీ ఒక క్రమ పద్ధతిలో విశ్లేషిస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. దాని ద్వారా సదరు మహిళ గర్భవతా, కాదా అనేది నిర్థారిస్తుంది. దీనికోసం యాపిల్ కంపెనీ లక్షా 62వేల మంది నుంచి డేటా సేకరించింది. ఆ డేటాను విశ్లేషించి.. ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో ఏఐ టూల్ 92 పర్సెంట్ యాక్యురసీతో పాస్ అయింది.
1.62 లక్షలమంది నుంచి సమాచారం..
ఫౌండేషన్ మోడల్స్ ఆఫ్ బిహేవియరల్ డేటా ఫ్రమ్ వేరబుల్స్ ఇంప్రూవ్ హెల్త్ ప్రిడిక్షన్స్ అనే పేరుతో యాపిల్ కంపెనీ ఈ అధ్యయనం చేపట్టింది. వేరబుల్ బిహేవియర్ మోడల్ (WBM) అనే పేరుతో మెషిన్ లెర్నింగ్ మోడల్‌నుల యాపిల్ పరిచయం చేస్తోంది. ఈ WBM చాలా తెలివైనది. హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవల్స్ వంటి సెన్సార్ ఆధారిత సంప్రదాయ ఆరోగ్య నమూనాలతోపాటు.. దీర్ఘకాలిక ప్రవర్తనా మార్పుల్ని కూడా పసిగడుతుంది. నిద్ర తీరు, యాక్టివ్ నెస్, హార్ట్ బీట్ లో వైవిధ్యం.. వంటి అనేక లక్షణాలను లెక్కిస్తుంది. WBM అనేది ఆపిల్ హార్ట్ అండ్ మూమెంట్ స్టడీ (AHMS)లో భాగంగా అభివృద్ధి చేయబడింది. దీనికోసం 1.62 లక్షలమందినుంచి సమాచారం సేకరించారు. ఈ సమాచారం 2.5 బిలియన్ గంటల కంటే ఎక్కువ. ఈ డేటాను విశ్లేషించేలా AI మోడల్‌కు శిక్షణ ఇచ్చారు. ఈ మోడల్ 57 విభిన్న ఆరోగ్య పరిస్థితులను అంచనా వేస్తుంది.
త్వరలో అందుబాటులోకి..
గర్భ ధారణ, ఇన్ఫెక్షన్లు, గాయం నుంచి కోలుకోవడం.. వంటి పరిస్థితుల్లో శరీరంలోని సూక్ష్మ మార్పులను ఇది కచ్చితంగా అంచనా వేయగలదు. ఆపిల్ వాచ్ AI గర్భధారణను 92 శాతం ఖచ్చితత్వంతో గుర్తించగలదని కొత్త అధ్యయనం చెబుతోంది. ఈ WBM అనేది వాచ్ వినియోగదారుల శారీరక మార్పులతోపాటు, వారి ప్రవర్తనపై కూడా దృష్టి పెడుతుంది. ఫలితాలు కూడా అద్భుతంగా ఉండటంతో త్వరలో ఈ ఏఐ ఫీచర్ ని యాపిల్ వాచ్ లలో నిక్షిప్తం చేసేందుకు కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
మంచి-చెడు..
గర్భధారణ అనేది సున్నితమైన విషయం. దాన్ని గోప్యంగా ఉంచుకోవాలని చాలామంది అనుకుంటారు. అయితే యాపిల్ వాచ్ తో ఈ గర్భధారణ వ్యవహారం బహిరంగమయ్యే అనుమానాలు కూడా ఉన్నాయి. వాచ్ లోని డేటాని తస్కరించగలిగితే ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితులన్నీ మరొకరికి తెలిసిపోతాయి. అయితే యాపిల్ ప్రోడక్ట్స్ లో ఉపయోగించే సెక్యూరిటీ ఫీచర్స్ వీటికి వరం అని చెప్పుకోవాలి. సున్నిత సమాచారం ఇతరులకు చేరకుండా ఈ సెక్యూరిటీ ఫీచర్స్ నిరోధిస్తాయి.