Akasha Ganga Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతీరోజూ జరిగే కైంకర్యాలు భక్తులకు అద్భుత అనుభూతిని కలిగిస్తాయి. కానీ వాటి వెనుక ఉన్న ప్రతి రీతి, ప్రతి ప్రక్రియకు ఓ భక్తి భరితమైన చరిత్ర ఉంది. ప్రత్యేకంగా స్వామి వారికి ప్రతి నిత్యం వినియోగించే పవిత్ర గంగా జలం గురించి వింటే, అది నెత్తిపై పెట్టుకుని రావాల్సిన కష్టమే కాదు, భక్తి పరాకాష్ఠకూ ప్రతీకగా నిలుస్తుంది.
తిరుమలనంబి భక్తి.. స్వామి కరుణగా మారిన కధ!
తొమ్మిదవ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరుని భక్తుడిగా ప్రసిద్ధిచెందిన తిరుమలనంబి, స్వామి కైంకర్యానికి ప్రతిరోజూ పాపనాశనం తీర్థం నుండి జలాన్ని నడకన తెచ్చేవారు. తన వృద్ధాప్యం, శరీరబలం తగ్గినా కూడా, తిరుమలనంబి భక్తిలో మాత్రం ఎటువంటి తగ్గుదల లేదు. ఇదే భక్తిని మెచ్చిన స్వామి, ఒకరోజు బోయవారు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నీరు తాగేందుకు ఇవ్వు అని అడిగిన స్వామికి, తిరుమలనంబి.. ఇది స్వామి కైంకర్యానికి తీసుకెళుతున్న పవిత్ర జలం, నీ దాహానికి ఇవ్వలేనని తిరస్కరించారు.
స్వామి లీల.. ఆకాశ గంగా ఆవిర్భవించిన ఘట్టం
ఈ సంభాషణ తరువాత స్వామి తన విల్లు సాయంతో కొండను తాకారు. ఒక్కసారిగా ఆ కొండ నుండి జలధార ఉవ్వెత్తున బయలుదేరింది. అదే ఆకాశ గంగ తీర్థం. అప్పటి నుండి ప్రతి రోజు స్వామి కైంకర్యాలకు ఉపయోగించే నీరు అక్కడి నుండి తీసుకువచ్చే ఆనవాయితీ ప్రారంభమైంది.
బంగారు బిందె.. భక్తికి వచ్చిన బహుమతి
తిరుమలనంబికి కుండ లేదన్న తరువాత స్వామి స్వయంగా బంగారు బిందెను ప్రసాదించారు. ఆ బిందె నింపి తిరుమలనంబి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఈ సంఘటన తరువాత తిరుమల ఆలయంలో ఆకాశ గంగ నుండే స్వామి అభిషేకానికి జలం తెచ్చే సంప్రదాయం ఏర్పడింది.
Also Read: Vijayawada Railway Station: విజయవాడ స్టేషన్ కు న్యూ లుక్.. ఎయిర్ పోర్ట్ కు మించిందిగా!
అర్ధరాత్రి ప్రయాణం.. నిత్య కైంకర్యానికి జీవనాధారం
ప్రతీరోజూ అర్ధరాత్రి ఆలయ అర్చకులు ఆకాశగంగ తీర్థానికి బయలుదేరతారు. సుమారు 10 కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని నడకన చేరుకుంటారు. అక్కడ బిందెను శుభ్రం చేసి, ఆకుతో నీటిని నింపి, గోవిందా.. గోవిందా అంటూ నామస్మరణల మధ్య తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
శ్రీవారి మహా ద్వారం దాటి స్వామివారికి నివేదన
తిరిగి ఆలయం చేరుకున్న తరువాత, అర్చకులు మాడవీధిలో, మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పొందుతారు. బంగారు ధ్వజస్తంభం వద్ద నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించి, ఆ పవిత్ర జలాన్ని స్వామివారికి అభిషేకార్పణ కోసం సమర్పిస్తారు.
టిటిడి భద్రత.. తరం తరంగా కైంకర్య పరులు
ఈ కైంకర్యాన్ని తిరుమలనంబి వంశీయులు తరం తరంగా నిర్వహిస్తున్నారు. వారి భక్తి, ధైర్యాన్ని గుర్తించిన టీటీడీ, ఈ సేవను పూర్తి భద్రతతో కాపాడుతోంది. అటవీ మార్గం అయినప్పటికీ, రోజూ వారి కృషితో ఆకాశగంగ తీర్థం నీరు తిరుమల ఆలయంలో చేరుతోంది.
ఈ జలంలో నీరు కాదు.. భక్తి ప్రవాహం ఉంది!
ఆకాశగంగ నుండి వచ్చే నీరు కేవలం ఒక పాచి జలముగా కాదు.. అది భక్తి, సేవ, స్వామివారి అనుగ్రహానికి ప్రతీకగా నిలుస్తోంది. స్వామి లీలలు, భక్తుడి నిబద్ధత ఎలా దైవాన్ని కరిగిస్తాయో, ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.