Mobile Battery: ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌లో స్క్రోలింగ్ చేయాలంటే.. ఫుల్‌ఛార్జ్ ఉండాలనుకుంటారు చాలామంది. కాలేజీకి వెళ్లాలన్నా, ఆఫీసుకి వెళ్లాలన్నా.. ఇంట్లో ఖాళీగా ఉండాలన్నా.. ఫోన్లో మాత్రం ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటారు. అయితే ఫోన్‌ను ఉపయోగించడానికి, ఛార్జ్ చేయడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. పదే పదే 100 శాతం ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. మీకూ ఇలా 100% ఛార్జింగ్ పెట్టే అలవాటు ఉన్నట్లయితే.. వెంటనే మానేయండి. మాటిమాటికీ ఫుల్‌ఛార్జ్ ఎందుకు చేయకూడదంటే?
రోజంతా ఫోన్‌ను స్క్రోల్ చేయాలంటే.. ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉండాలనే ఉద్దేశంతో, 100 శాతానికి తగ్గకుండా ఛార్జింగ్ ఎక్కిస్తుంటారు కొంతమంది. ఒకవేళ పూర్తిగా 100% ఉన్నా సరే కేబుల్ తీయకుండా అలానే ఉంచుతారు. కానీ, ఇది అస్సలు మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. అలా ఫుల్ ఛార్జింగ్ పెట్టడం వల్ల ఫోన్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీపై ఒత్తిడి పెరిగి దాని పనితీరు దెబ్బతింటుంది. ఒక్కోసారి బ్యాటరీ మీద తీవ్ర ఒత్తిడి ఏర్పడితే, పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
మీ ఫోన్‌కు 100 శాతం ఛార్జింగ్ పెట్టిన తర్వాత కూడా ప్లగ్ తీయకుండా అలానే వదిలేస్తే.. ‘ట్రికిల్ ఛార్జింగ్’ స్థితిలోకి చేరుకుంటుంది. దీనివల్ల అధిక వేడి ఉత్పత్తి అయ్యి, బ్యాటరీ చెడిపోయే ప్రమాదం ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అయితే, అప్పుడప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ.. బ్యాటరీ పాడవ్వకుండా ఉండాలంటే మాత్రం.. 40 శాతం నుంచి 80 శాతం మధ్య ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అని చెబుతున్నారు నిపుణులు.
* గంటలు తరబడి ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి వదిలేయకూడదు.
* ఎల్లప్పుడూ ఒరిజినల్ ఛార్జర్‌నే ఉపయోగించాలి.
* మీ మోడల్ బ్రాండ్ ఛార్జర్ వాడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
* అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టకపోవడమే ఉత్తమం.
* ఛార్జర్ వేడెక్కడం లేదా శబ్దాలు రావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే తీసేయాలి.
* అన్నివేళలా ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలాగే ఉంచడం మంచిది కాదు.