Jubilee Hills Byelection: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేయగా, బీజేపీ-బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ యూసుఫ్‌గూడ చౌరస్తాలో జరిగిన మహిళా కాంగ్రెస్ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను సుసంపన్నం చేసేందుకు సంకల్పించిందన్నారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇందిరమ్మ క్యాంటీన్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల డ్రెస్ కుట్టే బాధ్యత కూడా వారికే అప్పగించామన్నారు.
Read Also: Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?
మహిళా సంఘాల రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని, మొట్టమొదటిసారిగా వారికి భీమా వసతి కల్పించామని అన్నారు. ప్రమాదవశాత్తూ సభ్యురాలు మరణిస్తే అప్పు మాఫీతో పాటు, వారి కుటుంబానికి రూ. 10 లక్షలు అందుతాయని హామీ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు ఆదరణ కొరవడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఒక్క జూబ్లీహిల్స్‌లోనే 40 వేల కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉన్నాయని, ఈ ఉప ఎన్నికల విజయంలో మహిళలు కీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ అభ్యర్థికి 10 వేల ఓట్లు దాటవు: మంత్రి పొన్నం ప్రభాకర్
కిషన్ రెడ్డి మాటలు జోక్‌గా అనిపిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. “మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ పరిధిలోని జూబ్లీహిల్స్‌లో గతంలో 25 వేల ఓట్లు తెచ్చుకున్న మీ అభ్యర్థికి, ఈసారి 10 వేల ఓట్లు కూడా దాటవని ఛాలెంజ్ చేస్తున్నా” అని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు తీసుకున్న కిషన్ రెడ్డి, దానికి గురు భక్తిగా ఇప్పుడు బీజేపీ ప్రచార వ్యవస్థను బీఆర్ఎస్‌కు హ్యాండోవర్ చేశారని పొన్నం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ “దింపుడు గల్లెం” వ్యవహారం, లోపాయికారి మద్దతు గురించి నియోజకవర్గం మొత్తం చర్చించుకుంటోందన్నారు. పదేళ్లుగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉండి జూబ్లీహిల్స్‌కు ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.