China Ai Hospital| ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటున్న కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) ఇప్పుడు అన్ని రంగాల్లో సాంకేతిక మార్పులకు మూలకారణమవుతోంది. ముఖ్యంగా వైద్య రంగంలో ఏఐ అద్భుతాలు చేస్తోంది. దీనిద్వారా వైద్య సేవల్లో వేగం, కచ్చితత్వం పెరగడమే కాక, వైద్య శిక్షణలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ దిశగానే ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రిని చైనా లో లాంచ్ అయింది.
“ఏజెంట్ హాస్పిటల్” పేరుతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిని సింఘువా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ ఆసుపత్రిలో పని చేసే డాక్టర్లు, నర్సులు అన్నీ ఏఐ ఆధారిత రోబోల్లే. ఇవి ఉబ్బసం, గొంతునొప్పి వంటి సుమారు 30 రకాల సాధారణ జబ్బులకు చికిత్సలందిస్తాయి. ఏఐ వైద్యుల పని తీరు, ప్రతిస్పందన సామర్థ్యం వైద్య రంగంలో ఇది ఒక మైలురాయి అనిపించేలా చేస్తోంది.
ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసిన రీసెర్చ్ టీం లీడర్ లియు యాంగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏఐ డాక్టర్లు USMLE (యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్)లో 93.06% స్కోరు సాధించారు. కొన్ని వారాల్లోనే పలు సంవత్సరాల అనుభవాన్ని సంతరించుకున్నట్టుగా పనితీరు చూపించగలిగారు. ఇందులో 14 మంది AI డాక్టర్లు, 4 మంది AI నర్సులు ఉండగా.. రోజుకు సుమారు 3,000 మంది రోగులతో పరస్పర చర్య చేయగలిగే సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
అయితే, భావోద్వేగాలు లేని యంత్రాలైన AI డాక్టర్లు, శస్త్రచికిత్సలు చేయడం సమంజసం కాదని అనేక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ టెక్నాలజీని సహాయక పాత్రకు పరిమితం చేయాలని సూచనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు సౌదీ అరేబియా దేశంలో కూడా ఒక ఏఐ క్లినిక్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేశారు. తూర్పు సౌదీలోని అల్ అహ్సా ప్రాంతానికి చెందిన అల్ మూస్ హెల్త్ గ్రూప్ తో సంయుక్తంగా ఈ ఏఐ క్లినిక్ ప్రారంభించారు. ఇక్కడ డాక్టర్ హుఆ పేరుతో ఒక వర్చువల్ డాక్టర్ రోగుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారితో మాట్లాడి మందులు ప్రిస్క్రైబ్ చేస్తుంది.
ఏఐ నిపుణులకు ఫుల్ డిమాండ్
ఇక భారత్‌లో కూడా ఏఐ రంగం వేగంగా ఎదుగుతోంది. ప్రస్తుతం దేశంలో 4.16 లక్షలకుపైగా AI నిపుణులు ఉన్నప్పటికీ, డిమాండ్-సరఫరా మధ్య 51 శాతం గ్యాప్ ఉంది. 2017 నుండి ఇప్పటివరకు AI రంగంలో నియామకాలు ఎనిమిది రెట్లు పెరిగాయి. ముఖ్యంగా గతేడాది మార్చి నుండి ఈ ఏడాది మార్చి మధ్య AI, డేటా నిపుణులకు డిమాండ్ 45% పెరిగిందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు.
ఎంట్రీ లెవెల్ నిపుణులకు ఏటా రూ. 8-12 లక్షల జీతాలు లభిస్తుండగా, NLP, జనరేటివ్ AI లో అనుభవం ఉన్నవారికి రూ. 25-35 లక్షల వరకు జీతాలు అందుతున్నాయి. జీసీసీల్లో సీనియర్ ప్రొఫెషనల్స్ రూ. 45 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు.
Also Read: ఏఐ ఉందిగా అని ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. నిండా మునిగింది
AI నియామకాలలో BFSI రంగం ముందు వరుసలో ఉండగా, IT సేవలు, హెల్త్‌కేర్ రంగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా NLP నిపుణులు, డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, AI డెవలపర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పైథాన్, టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ వంటి టెక్నాలజీలపై ప్రాధాన్యత ఉంది.
AI అభివృద్ధికి విద్యా సంస్థలు, పరిశ్రమలు, పాలక వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే భారత్ ప్రపంచ AI రంగంలో ముందుండగలదు. నైపుణ్యాలను పెంపొందించేందుకు సరైన ప్రోగ్రామ్‌లు రూపొందించాల్సిన అవసరం ఉంది.