Cyber Attack software| సైబర్ దాడులు ఈ రోజుల్లో అందరికీ ఒక పెద్ద ముప్పుగా మారాయి. ఈ దాడుల్లో హ్యాకింగ్ లో నిపుణులైన నేరగాళ్లు యూజర్ల డేటాను దొంగిలించడం లేదా సిస్టమ్‌లను దెబ్బతీయడం వంటి నేరాలకు పాల్పడుతుంటారు. ఈ దాడుల పద్ధతులను అర్థం చేసుకోవడం ద్వారా మీరు సురక్షితంగా ఉండవచ్చు. అందుకే సైబర్ దొంగలు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి మీ డేటాను దోచుకుంటారు అనే వివరాలు మీ అవగాహన కోసం ఇక్కడ తెలుపబడ్డాయి.
హ్యాకర్లు సాధారణంగా సులభమైన, కానీ ప్రభావవంతమైన పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఫిషింగ్ ఈమెయిల్స్ – ఈ పద్ధతిలో పెద్ద ఫేమస్ కంపెనీ పేర్లతో పోలిన ఐడీలను సృష్టించి వాటి నుంచి నుండి మెయిల్స్ పంపిస్తారు. వినియోగదారులను భయపెట్టి, లేదా మధ్య పెట్టే మెసేజ్ అందులో ఉంటుంది. ఆ విధంగా వారి నుంచి మోసపూరితంగా వారి పాస్‌వర్డ్‌లను సేకరిస్తారు. అలాగే ఆ మెయిల్స్ లో మాల్వేర్ అనే వైరస్, స్పైవేర్ వంటి హానికరమైన ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌లు.. యూజర్ల సిస్టమ్ సెక్యూరిటీ ఫైళ్లను దెబ్బతీస్తాయి లేదా వినియోగదారుడికి తెలియకుండా డేటాను దొంగిలిస్తాయి.
రాన్సమ్‌వేర్: డిజిటల్ కిడ్నాపర్
రాన్సమ్‌వేర్ అనేది పెద్ద కంపెనీ కంప్యూటర్ సర్వర్ ఫైళ్లను బందీగా చేసే దాడి. హ్యాకర్లు.. ఒక పెద్ద కంపెనీ సర్వర్ ని హ్యాక్ చేసి అందులో వారి బిజినెస్ ఫైళ్లను లాక్ చేస్తారు. అంటే కంపెనీ ఉద్యోగులకు ఎవరికీ ఈ ఫైళ్లు అందుబాటులో ఉండవు. దీంతో వారి వ్యాపారం దెబ్బతింటుంది.. ఆ ఫైళ్లను తిరిగి వారికి ఇవ్వడానికి హ్యాకర్లు వారి నుంచి రాన్సమ్ అంటే డబ్బు డిమాండ్ చేస్తారు. చాలా వ్యాపార సంస్థలు ఈ రాన్సమ్ చెల్లిస్తాయి. ఇది చాలా లాభదాయకంగా ఉండడంతో హ్యాకర్లు ఎక్కువగా రాన్సమ్‌వేర్ పద్దతిని అనుసరిస్తుంటారు.
DDoS దాడిలో.. హ్యాకర్లు వెబ్‌సైట్‌లను అనవసరమైన ట్రాఫిక్‌తో ఓవర్‌లోడ్ చేస్తారు. దీనివల్ల సర్వర్ క్రాష్ అవుతుంది, ఫలితంగా నిజమైన వినియోగదారులు సైట్‌ను యాక్సెస్ చేయలేరు. సాధారణంగా పెద్ద కంపెనీలను టార్గెట్ చేసుకొని ఈ దాడులు జరుగుతుంటాయి.
కీలాగింగ్ సాఫ్ట్‌వేర్.. టైప్ చేసిన ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేస్తుంది. పాస్‌వర్డ్‌లతో లాగిన్ వివరాలను ఉపయోగించి హ్యాకర్లు డేటాను దొంగిలిస్తారు. ఈ పద్ధతిలో బాధితుడికి తన వివరాలు దొంగలించబడతాయనే విషయం అసలు తెలియదు.
AI టెక్నాలజీతో, సైబర్ దొంగలు మరింత పవర్‌ఫుల్ దాడులు చేయగలుగుతున్నారు. డీప్‌ఫేక్ అనేది AI ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలు లేదా ఆడియోని నిజమైనవిగా కనిపిస్తున్నాయి. వీటని గుర్తించడం కష్టం. ఈ డీప్‌ఫేక్‌లను ఉపయోగించి, హ్యాకర్లు బాధితులను మోసం చేసి డబ్బు బదిలీ చేయమని బ్లాక్ మెయిల్ చేస్తారు.
ఇంతకాలం సైబర్ క్రిమినల్స్ చేసే దాడులకు హై ఎండ్ టెక్నాలజీ అవసరం ఉండేది కాదు. ఎందుకంటే 90% సైబర్ దాడులు యూజర్లు చేసే మానవ తప్పిదాల వల్ల సాధ్యమయ్యేవి. అయితే, ఈ దాడుల గురించి కొంతవరకు అవగాహన పెరిగింది. యూజర్లు ఇలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను ప్రభుత్వం, బ్యాంకులు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు క్రిమినల్స్ ఏఐ ఆధారంగా మరింత సంక్లిష్టంగా అటాక్ చేస్తున్నారు.
సాధారణ దాడులు వ్యక్తులకు డేటా లేదా డబ్బు నష్టాన్ని కలిగిస్తాయి. అయితే, సంక్లిష్టమైన AI దాడులు పెద్ద కంపెనీలకు దాదాపు పూర్తిగా నాశనం చేయగలవు.
ప్రతి ఈ మెయిల్, సోషల్ మీడియా, బ్యాంకు అకౌంట్ ఆన్ లైన్ పాస్ వర్డ్‌లు క్లిష్టంగా ఉండే విధంగా పెట్టుకోవాలి. రెండు-దశల ప్రమాణీకరణ (2FA) అందుబాటులో ఉంటే, దాన్ని ఆన్ చేయండి. అనుమానాస్పద లింక్‌లు లేదా ఈమెయిల్‌లను నివారించండి. సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.
కంపెనీ సైబర్ దాడులను AI సహాయంతో ఎదుర్కోవడంలో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. Aims90 వంటి AI సిస్టమ్‌లు అనుమాస్పద లింక్స్, మెసేజ్‌లను గుర్తిస్తాయి. దాడులను నిరోధిస్తాయి. ఒకవిధంగా ఇప్పుడు AI సైబర్ అటాక్ టెక్నాలజీ vs AI డిఫెన్స్ టెక్నాలజీ మధ్య యుద్ధం జరుగుతోంది.
సైబర్ క్రిమినల్స్ నిరంతరం కొత్త కొత్త టెక్నాలజీతో అప్ గ్రేడ్ అవుతున్నారు. అందుకే యూజర్లు కూడా సెక్యూరిటీ అప్డేట్స్ చేస్తూ ఉండాలి. ఎలాంటి సైబర్ మోసాలు జరుగుతున్నాయో తెలుసుకుంటూ అవగాహనతో ఉండాలి.
Also Read: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు