AC To Air Purifier| చలికాలం, వాహన కాలుష్యంతో గాలి విషపూరితంగా మారుతోంది. శ్వాస సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో వస్తున్న ప్రజల సంఖ్య ఇటీవలే బాగా పెరుగుతోంది. బయట కాలుష్యా నివారణ పూర్తిగా చేతుల్లో లేదు. కానీ ఇంట్లో, ఆఫీసు గదుల్లో స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్లు చాలా మంది ఉపయోగిస్తున్నారు. గాలి కాలుష్యం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారిపోవడంతో ఇంట్లో ప్రత్యేకంగా ఎయిర్ ప్యూరిఫైయర్‌ను కొనుగోలు చేయడం అవసరంగా మారింది.
అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయకుండా కూడా మీ ఇంట్లో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. దీనికి ఇంట్లో ఏసీ (ఎయిర్ కండీషన్) ఉంటే చాలు. అవును ఇంట్లో ఉన్న ఏసీనే ఎయిర్ ప్యూరిఫైయర్ గా మార్చుకోవచ్చు. అయితే దీని కోసం ఎయిర్ కండిషనర్‌లో మెరుగైన ఫిల్టర్‌ను అమర్చాలి.
ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ మీ గదిలోని గాలిని తీసుకొని, ట్రూ హెపా ఫిల్టర్‌ల ద్వారా ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్‌లు గాలిలోని 99.97% దుమ్ము, పొగ వంటి చిన్న చిన్న కణాలను బంధిస్తాయి. ఆ తర్వాత, శుభ్రమైన గాలిని మళ్లీ గదిలోకి విడుదల చేస్తుంది. అలా గాలిని శుద్ధి చేయడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
సాధారణంగా మీ ఇంట్లో ఉండే ఎయిర్ కండిషనర్ గాలిని తిప్పుతూ, ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. మీరు ఏసీలో ఉన్న సాధారణ డస్ట్ ఫిల్టర్‌ను హెపా లేదా PM2.5 రేటెడ్ ఫిల్టర్‌తో మార్చండి. ఇలాంటి ఫిల్టర్‌లు గాలిలోని కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీనివల్ల మీ ఏసీ రెండు పనులు చేస్తుంది. గదిని చల్లబరుస్తూనే గాలిని శుద్ధి చేస్తుంది. ఇలా చేస్తే ఎయిర్ ప్యూరిఫైయర్ స్థలం ఆదా చేయొచ్చు.. అలా కొనాల్సిన ఖర్చు కూడా మిగిలిపోతుంది.
ఏసీని ఎయిర్ ప్యూరిఫైయర్ గా మార్చడానికి మరో మార్గం ఉంది. మీరు ప్రత్యేక ఫిల్టర్ ప్యానెల్‌ను కొని, దాన్ని ఏసీ ఇండోర్ యూనిట్ లో అమర్చండి. ఏసీ ఈ ఫిల్టర్ ద్వారా గాలిని పీల్చుకుంటుంది. ఇది ఏసీ ఫ్యాన్ మోటార్‌పై ఒత్తిడి పెంచకుండానే గాలిని శుద్ధి చేస్తుంది. ఇది సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి.
ఎయిర్ ప్యూరిఫైయర్‌లు గాలిని శుద్ధి చేయడంలో అత్యుత్తమంగా పనిచేస్తాయి. అవి ఉన్నతమైన ఫిల్టరింగ్‌ను అందిస్తాయి. ఏసీతో సంబంధం లేకుండా పనిచేస్తాయి. అయితే, ఏసీ ఫిల్టర్‌ను అప్‌గ్రేడ్ చేస్తే, మీరు ఒకే పరికరంతో రెండు పనులు (చల్లబరచడం, గాలి శుద్ధి) చేయవచ్చు. ఇది డబ్బు, స్థలం ఆదా చేస్తుంది.
ఏసీ ఫిల్టర్‌ను అప్‌గ్రేడ్ చేస్తే ఒక పెద్ద నష్టం ఉంది. హెపా ఫిల్టర్‌లు మందంగా ఉంటాయి, ఇవి గాలి ప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. దీనివల్ల ఏసీ ఫ్యాన్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది విద్యుత్ బిల్లును పెంచుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువ సేపు ఉపయోగిస్తే.. ఏసీ యూనిట్ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.
మీకు ఎయిర్ ప్యూరిఫైయర్ కొనే బడ్జెట్ ఉంటే.. అది బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా తీవ్రమైన అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నవారికి ఇది సరైనది. అయితే, కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం ఖర్చు చేయడం ఇబ్బందిగా ఉంటే.. ఖర్చు లేకుండా ఏసీ ఫిల్టర్ ని అప్‌గ్రేడ్ చేయడం లేదా థర్డ్ పార్టీ ఫిల్టర్ ప్యానెల్ బెస్ట్ ఆప్షన్. ఈ రెండో పద్ధతి తక్కువ రిస్క్‌తో, తక్కువ ఖర్చుతో గాలిని శుద్ధి చేస్తుంది. మీ ఆరోగ్య అవసరాలకు, బడ్జెట్‌కు తగిన ఆప్షన్ ఎంచుకోండి. స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి ఎంతో అవసరం.
Also Read: ఐఫోన్‌ని మరింత వేగంగా ఉపయోగించండి.. ఈ ఫాస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా?