
Netflix Users:- సైబర్ నేరాలకు పాల్పడాలి అనుకుంటున్న వారి రోజుకొక కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కొత్త కొత్త వెబ్సైట్లను సృష్టించడం, దాని ద్వారా యూజర్ల పర్సనల్ సమాచారంతో పాటు బ్యాంకు సమాచారాన్ని కూడా దొంగలించి, వారి అకౌంట్‌లోని డబ్బులను తమ అకౌంట్లలోకి ట్రాన్ఫర్ చేయడం.. ఆపై సైబర్ పోలీసులకు కూడా దొరకకుండా జాగ్రత్తపడడం.. ఇవన్నీ కామన్‌గా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ యూజర్లు కూడా సైబర్ నేరస్తులకు టార్గెట్‌గా మారుతున్నారని తేలింది.
ఈరోజుల్లో నెట్‌ఫ్లిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్, సిరీస్ లవర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్న ఓటీటీగా ఫేమస్ అయ్యింది. అయితే ఈ నెట్‌ఫ్లిక్స్‌ను నెలకు ఒకసారి, లేదా ఆరు నెలలకు ఒకసారి, లేదా ఏడాదికి ఒకసారి.. ఇలా సబ్‌స్క్రిప్షన్‌ను రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. దీనికి వారి బ్యాంకు సమాచారం అవసరం పడుతుంది. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ కొత్తగా నెట్‌ఫ్లిక్స్ యూజర్ల బ్యాంకు సమాచారాన్ని హ్యాక్ చేసి వారి అకౌంట్‌లోని డబ్బులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని స్టడీలో తేలింది.
కొన్నిసార్లు హ్యాకింగ్ అనేది కేవలం నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కోసం జరిగినా.. మరికొన్ని సార్లు మాత్రం యూజర్ల బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను దొంగలించడానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సైబర్ నిపుణులు స్వయంగా బయటపెట్టారు. 2023లోనే అతిపెద్ద నెట్‌ఫ్లిక్స్ స్కామ్ జరిగిందని వారు గమనించారు. ఒక ఫేక్ వెబ్సైట్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లోకి లాగిన్ అవ్వమని, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ కోసం బ్యాంకు వివరాలను నింపమని చెప్పి.. అలా యూజర్ల అకౌంట్ నుండి డబ్బులను కాజేస్తున్నట్టు వారు తెలిపారు.
2022 డిసెంబర్‌లో ఒక 74 ఏళ్ల వ్యక్తి తన నెట్‌ఫ్లిక్స్ అకౌంటును ఓపెన్ చేసే ప్రయత్నంలో 1,200 డాలర్లను కోల్పోయాడు. దీంతో ఈ స్కామ్ గురించి చాలామందికి తెలిసింది. అందుకే నెట్‌ఫ్లిక్స్‌ను కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు కానీ, దానిని రెన్యూవల్ చేయాలి అనుకున్నప్పుడు కానీ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీపై ఎక్కువగా అవగాహన లేనివారు సైబర్ నేరస్థులకు టార్గెట్ అని వారు చెప్తున్నారు. అందుకే తెలియని మెయిల్‌ను ఓపెన్ చేయడం, అందులోని లింక్‌ను క్లిక్ చేయడం లాంటివి చేయకూడదని హెచ్చరించారు.