శుభాన్షు శుక్లాకి హాయ్ చెప్పాలనుకుంటున్నారా..?
ఐఎస్ఎస్ గమనాన్ని మీరు చూడాలనుకుంటున్నారా..?
ఇది సాధ్యమేనా అని మీరు అనుకోకండి, ఇప్పుడు సాధ్యమే. ఎందుకంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) భారతీయులకు కనపడే అవకాశం వచ్చింది. ISS గమనాన్ని మనం కొన్నిరోజులపాటు చూడవచ్చు. ప్రస్తుతం అది తిరిగే కక్ష్య భారత్ పైనుంచే ఉంది. అందుకే మన దేశంలో ఉన్నవారంతా మరికొన్నిరోజులు ISSని స్పష్టంగా చూడవచ్చు. అయితే మీరు శుభాన్షు శుక్లాకి చేయి ఊపినా ఆయన మిమ్మల్ని గమనించకపోవచ్చు. ఎందుకంటే ISS నుంచి చూస్తే మనం భారత్ ని ప్రత్యేకంగా గుర్తు పట్టలేం. భూమి అంతా ఒకటిగా కనపడుతుంది. శుభాన్షు మనకు రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ, మనం మాత్రం ఆయనకి హాయ్ చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టొద్దు అని అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఎలా చూడాలి..?
భూమిపైనుంచి చూస్తే ISS ఒక నక్షత్రంలా కనపడుతుంది. అయితే ఇది వేగంగా కదులుతుంది. ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు అది ఈవైపు నుంచి ఆవైపుకి వెళ్లిపోతుంది. అది కూడా సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం సమయంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. గంటకు 28,000 కి.మీ వేగంతో భూమి చుట్టూ ఐఎస్ఎస్ భ్రమణం చేస్తుంది. ప్రతి 90 నిమిషాలకు ఒక భ్రమణం పూర్తవుతుంది. అక్కడ ఉన్న వ్యోమగాములు ప్రతిరోజూ 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను చూస్తారన్నమాట.
గుర్తించడం ఎలా..?
సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో కొన్ని నక్షత్రాలు మనకి ఆకాశంలో కనిపించవచ్చు. కొన్ని జెట్ విమానాలు కూడా వెళ్తుంటాయి. అయితే వాటికి మన ఐఎస్ఎస్ కి స్పష్టమైన తేడా కనిపెట్టాలంటే ఎలా..? కేవలం 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే కనపడే ఐఎస్ఎస్ కచ్చితమైన భ్రమణ సమయం తెలుసుకోవాలంటే ఎలా..? దానికి ఓ మార్గముంది. ISSని ట్రాక్ చేయడానికి మనం శాస్త్రవేత్తలు కానవసరం లేదు. నాసాకు చెందిన ISS డిటెక్టర్, spot the station వంటి యాప్ లను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే కచ్చితమైన వివరాలు మనకు తెలుస్తాయి. మనం భూమిపై ఉన్న ప్రదేశానికి ఐఎస్ఎస్ ఎంత దూరంలో ఉంది, కచ్చితంగా మనం ఉన్న ప్రాంతం పైకి అది ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు కనపడుతుంది..? ఇలాంటి వివరాలన్నీ అందులో ఉంటాయి. కొన్ని యాప్ లు అగ్మెంటెడ్ రియాలిటీ మోడ్(ఏఆర్)ని కూడా అందిస్తాయి, యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత ఆకాశంలో మనం ఏవైపు చూడాలనేది కూడా అదే చెబుతుంది.
మంచి తరుణం..
ఈ మంచి తరుణం మించిన దొరకదు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ మనం శుభాన్షు శుక్లాకి హాయ్ చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఐఎస్ఎస్ అక్కడే ఉంటుంది కానీ అందులో శుభాన్షు ఉండకపోవచ్చు, ఆయన భూమిపైకి తిరిగి వచ్చేస్తారు. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఈనెల 24 నుంచి ఆగస్టు 1 మధ్య మాత్రమే ఐఎస్ఎక్ తిరిగి భారత్ ఉండే భూభాగం పైకి వస్తుంది. అప్పటికి శుక్లా ఇంటికి తిరిగి వస్తారు కాబట్టి, ఆయన్ను మనం విష్ చేయలేమంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ ఇన్ స్టాల్ చేసుకుని డాబాపైకి పరిగెత్తండి.