Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉపఎన్నిక ఫలితాలపై ముస్లిం మైనారిటీ ఓటర్ల వైఖరి తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక్కడి ముస్లిం ఓటర్లలో దాదాపు 34 శాతం మెజారిటీ భాగం కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా సర్వేలు, రాజకీయ విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నికను వారు కేవలం స్థానిక అంశాలకే పరిమితం చేయకుండా.. జాతీయ స్థాయి అంశాలతో ముడిపెడుతుండటం గమనార్హం. ముస్లిం మైనారిటీల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి దేశవ్యాప్తంగా కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఈ వర్గం బలంగా విశ్వసిస్తోంది. ఈ విశ్వాసానికి తగ్గట్టుగానే.. కాంగ్రెస్ పార్టీ కూడా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం, రైట్ వింగ్ శక్తుల దాడులను ఎప్పటికప్పుడు ఖండించడం వంటి చర్యలతో మైనారిటీల పట్ల తమ నిబద్ధతను చాటుకుంటోందని స్థానిక ముస్లిం ఓటర్లు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. నియోజకవర్గంలోని మైనారిటీ మత పెద్దలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు.
బీఆర్ఎస్‌పై ముస్లిం ఓటర్లు ఆగ్రహం.. కారణాలివే..
జూబ్లీహిల్స్ ముస్లిం ఓటర్లలో బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా బీజేపీతో బీఆర్‌ఎస్ రహస్య పొత్తు నడుపుతోందనే ఆరోపణలు దీనికి ప్రధాన కారణం. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేందుకు ఓటర్లు పలు ఉదాహరణలను ప్రస్తావిస్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాడకపోవడం.. ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్ అభ్యర్థిని పోటీకి దించకుండా సహకరించడం.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన ఓటు బ్యాంకును బీజేపీకి మళ్లించడం, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి లాభం చేకూర్చేలా బీఆర్‌ఎస్ ఓటింగ్‌కు గైర్హాజరవ్వడం, బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనంపై కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటి కారణంగా ముస్లి ఓటర్లు బీఆర్ఎస్ పై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్‌ను ఓడించడం ఖాయం..?
ఈ కారణాలన్నీ బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య తెరవెనుక ఒప్పందం ఉందనడానికి నిదర్శనాలని భావిస్తున్న ముస్లిం ఓటర్లు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ను ఓడించడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో ఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) బహిరంగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా మారింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా బీజేపీ-బీఆర్‌ఎస్ రహస్య పొత్తును ఆయన గ్రహించడమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పొత్తు కారణంగానే బీజేపీ మామూలు అభ్యర్థిని నిలబెట్టిందని ఒవైసీకి తెలిసిందని చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్‌పై ఓవైసీ విమర్శలు..
గత పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌కు బీఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అభివృద్ధిని కోరే ముస్లింల సంక్షేమం దృష్ట్యా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఆయన పరోక్షంగా సందేశం ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్-ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ, ఈసారి కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు పలకడం రాజకీయం సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. రాజకీయ సమీకరణాలతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో రూ.200 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి అంశాలు కూడా ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి దోహదపడ్డాయని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. మొత్తం మీద జాతీయ రాజకీయ విశ్వాసం, బీఆర్‌ఎస్‌పై ఉన్న ఆగ్రహం, ఎంఐఎం మద్దతు, స్థానిక అభివృద్ధి వంటి అంశాల కలయికతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మూకుమ్మడిగా మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది.
ALSO READ: Hyderabad News: 8 ఏళ్ల పోరాటం.. హైడ్రా సాకారం, ఆనందంలో ప్లాట్ యజమానులు
ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. పోటీలో 58 మంది అభ్యర్థులు