ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. డెలివరీ సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా.. డ్రైవర్లు అందరికీ AI స్మార్ట్ గ్లాసెస్ ను అందించబోతోంది. వీటి ద్వారా ప్యాకేజీ డెలివరీలను వేగంగా, పూర్తి హ్యాండ్స్ ఫ్రీగా మార్చడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ AI ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ను పరీక్షిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ గ్లాసెస్ డ్రైవర్లు ప్యాకేజీలను స్కాన్ చేయడానికి, టర్న్ బై టర్న్ వాకింగ్ డైరెక్షన్స్ అనుసరించడానికి ఉపయోగపడనున్నాయి. ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ ను చూస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ గ్లాసెస్ AI ఆధారిత సెన్సింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, ఇన్ బిల్ట్ కెమెరాలను ఉపయోగించి, డెలివరీ ఇవ్వాల్సిన చోటుకు నేరుగా, వేగంగా వెళ్లి పార్శిల్ అందించేలా సాయపడనున్నాయి.
నిజానికి పార్శిల్ డెలివరీ పర్సన్స్ ఫోన్ ద్వారా లొకేషన్ చూసుకుంటూ వెళ్తు, ఫ్లాట్ నంబర్ కోసం వెతుకుతారు. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. కానీ, అమెజాన్ ప్రతి డెలివరీని తక్కువ సమయంలో చేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సమయాన్ని గణనీయంగా ఆదా చేయాలనుకుంటుంది. రోజూ అందించే మిలియన్ల కొద్ది పార్సిల్స్ విషయంలో మరింత సమయాన్ని సేవ్ చేయాలని భావిస్తోంది..
అమెజాన్ పార్శిల్ డ్రైవర్లు గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు, స్మార్ట్ గ్లాసెస్ ఆటో మేటిక్ గా పని చేయడం మొదలుపెడతాయి. వారు వ్యాన్ లోపల ఉన్న పార్శిల్ ప్యాకేజీ కచ్చితమైన స్థానాన్ని గుర్తించే అవకాశం కల్పిస్తాయి. AR-ఆధారిత డైరెక్షన్స్ తో డ్రైవర్ ను డెలివరీ స్పాట్ కు తీసుకెళ్తాయి. పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లు , బిజినెస్ పార్క్ లలోనూ వేగవంతంగా పార్శిల్ ఇచ్చేలా ఈ స్మార్ట్ గ్లాసెస్ సాయపడుతాయి. ఈ గ్లాసెస్ డెలివరీ వెస్ట్ లో నిర్మించిన కంట్రోలర్ కు అనుసంధానించబడి ఉంటాయి. ఆపరేషనల్ కంట్రోల్, మార్చుకునే బ్యాటరీ, ప్రత్యేక అత్యవసర బటన్ ఉంటాయి. గ్లాసెస్ ప్రిస్క్రిప్షన్ లెన్స్ లు, ఫోటోక్రోమిక్ లెన్స్ కు సపోర్ట్ చేస్తాయి. ఇవి రోడ్డు మీద ఎక్కువ గంటలు గడిపే డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉంటాయి.
ప్రస్తుతానికి ఉత్తర అమెరికాలోని డెలివరీ కార్యకలాపాలలో AI గ్లాసెస్ ను ట్రయల్ చేస్తున్నారు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ముందుకు అమెజాన్ డ్రైవర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. డ్రైవర్లకు ప్రామాణిక పరికరాలను తయారు చేయడానికి ముందు సిస్టమ్ విశ్వసనీయత, సౌకర్యం, AI కచ్చితత్వాన్ని చక్కగా ట్యూన్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టినట్లు కంపెనీ తెలిపింది. అన్ని పరీక్షలు పూర్తి అయిన తర్వాత వీటిని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించింది. వీటి ద్వారా తమ కంపెనీ తక్కువ సమయంలో మరిన్ని డెలివరీలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లకు వేగంగా పార్శిల్ డెలివరీ కావడంతో పాటు కంపెనీకి కూడా లాభం కలిగే అవకాశం ఉందని వెల్లడించింది.
Read also: జాబ్ కోసం అమెరికా వెళ్లి.. గ్రీన్ కార్డు రాగానే రిజైన్ చేశాడు.. ఇప్పుడు రూ.24,079 కోట్లకు అధిపతి!