Instagram Blend Feature: సోషల్ మీడియా అంటే ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు… ఇవన్నీ ఒకే వేదికపై పంచుకోవడమే. అయితే ఇన్‌స్టాగ్రామ్ ఈ మజాను ఇంకొంచెం కొత్తగా, మరింతగా అభివృద్ధి చేస్తోంది. వినూత్న ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ఈ యాప్, తాజాగా “ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్” అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇది కేవలం ఒక టెక్నికల్ అప్‌డేట్ కాదు. స్నేహితుల మధ్య సంబంధాలను మరింత బలపరచే సరికొత్త ప్రయోగం. ఇప్పటివరకు మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వ్యక్తిగతంగా ఆస్వాదించేవాళ్లం. కానీ ఇప్పుడు మనకు ఇష్టమైన ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే రకమైన రీల్స్‌ను చూసే అవకాశం కల్పిస్తోంది. అదే ‘బ్లెండ్’ మ్యాజిక్. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లెండ్ అంటే ఏంటి
ఇది Instagram Direct Messages (DMs)లో మీకు నచ్చిన ఫ్రెండ్ లేదా ఫ్రెండ్స్ గ్రూప్‌తో కలిసి ఉపయోగించుకోగల ఫీచర్. దీని ద్వారా మీరు చూస్తున్న రీల్స్, మీ ఫ్రెండ్‌లు చూస్తున్న రీల్స్ అన్నీ కలిసిపోయి ఒక ‘షేర్డ్ కస్టమ్ రీల్స్ ఫీడ్’గా తయారవుతుంది. ఆ ఫీడ్‌ను మీరు అందరూ కలిసి ఆస్వాదించవచ్చు. దీనివల్ల మీరు చూడకుండా మిస్ అయిన ఆసక్తికర రీల్స్ కూడా కనిపిస్తాయి.
బ్లెండ్ ఎలా పనిచేస్తుంది?
-బ్లెండ్ ఫీచర్ ఉపయోగించడం చాలా సింపుల్:
-మీ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక DM చాట్‌ను ఓపెన్ చేయండి. ఇది వన్-ఆన్-వన్ కూడా కావచ్చు లేదా గ్రూప్ చాట్ కావచ్చు.
-పైన ఉన్న “బ్లెండ్” చిహ్నంపై క్లిక్ చేయండి.
-ఇన్ వైట్ అనే ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్‌కి ఆహ్వానం పంపండి
-ఒకసారి వారు ఆహ్వానాన్ని అంగీకరిస్తే, బ్లెండ్ షేర్డ్ ఫీడ్ యాక్టివ్ అవుతుంది.
-ఇకపై ఆ చాట్‌లో ఉన్నవారంతా ఆ బ్లెండ్ రీల్స్ ఫీడ్‌ను ఎప్పుడైనా తిరిగి చూసుకోవచ్చు
-ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే, బ్లెండ్ కంటెంట్ ప్రతిరోజూ మారుతుంది. అంటే, మీరు బ్లెండ్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారీ కొత్త రీల్స్ చూడవచ్చు. ఇది ఒక రకంగా మీ ఫ్రెండ్‌ల ఇష్టాలను ప్రతిబింబించేలా ఉంటుంది.
బ్లెండ్‌లో సంభాషణ ఎలా?
ఈ ఫీచర్‌లో మీ ఫ్రెండ్‌లు చూసిన రీల్స్‌పై లైక్ చేస్తే లేదా కామెంట్ చేస్తే… అవి గ్రూప్ చాట్‌లో కనిపిస్తాయి. దీని వల్ల ఆ రీల్స్‌పై చర్చ జరిగే అవకాశముంటుంది. ఇది నిజంగా ఇంటరాక్టివ్ అనుభూతిని అందిస్తుంది. రీల్స్ చూసే అనుభవం ఇకపై కేవలం స్క్రోల్ చేయడం కాదు, మాట్లాడుకునే, స్పందించే వ్యవస్థగా మారిపోతోంది.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి
ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్‌ను గ్లోబల్‌గా అందుబాటులోకి తెచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దాన్ని వన్-ఆన్-వన్ లేదా గ్రూప్ DMsలో ఉపయోగించవచ్చు. ప్రతి బ్లెండ్ చాట్ ఒక్కొక్కటిగా ప్రత్యేకంగా రూపొందించబడుతుంది.
ఏం బెనిఫిట్స్?
-మీరు మిస్ అయిన మంచి రీల్స్‌ను ఫ్రెండ్స్ ద్వారా కనుగొనవచ్చు
-మీ ఇష్టాలకీ, ఫ్రెండ్స్ ఇష్టాలకీ మధ్య మధ్యలో ఉన్న కంటెంట్‌ను చూస్తారు.
-ఇది ఒక రకంగా ఇన్‌స్టాగ్రామ్‌ను “సోషల్” ప్లాట్‌ఫామ్‌గా తిరిగి తీసుకురావాలన్న ప్రయత్నం.
-Influencer, స్పాన్సర్డ్ కంటెంట్ కాకుండా, నిజమైన కనెక్షన్‌లకు ప్రాధాన్యత ఇస్తుంది.
TikTokతో పోటీకి
TikTok ఇప్పటివరకు ఇలా కస్టమైజ్డ్ షేర్డ్ ఫీచర్‌ను అందించలేదు. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు అలా చేసే ప్రయత్నంలో ఉంది. ఇది సహకారంగా కంటెంట్‌ను డిస్కవర్ చేయడమే కాదు, యూజర్లు ఎక్కువ సమయం యాప్‌లో ఉండేలా చేస్తుంది. మన ఫ్రెండ్ చూసిన రీల్ నచ్చితే, మనం కూడా చూస్తాం, మాట్లాడుకుంటాం. ఇది కచ్చితంగా usage timeని పెంచుతుందని చెప్పవచ్చు.
స్పాటిఫై బ్లెండ్ గుర్తొస్తుందా?
ఈ ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్ ఫీచర్‌ను చూస్తే Spotify Blend గుర్తొస్తుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వినియోగదారుల సంగీత అభిరుచుల ఆధారంగా ఒక మిక్స్ ప్లేలిస్ట్ తయారవుతుంది. అదే విధంగా, ఇన్‌స్టాగ్రామ్ బ్లెండ్ కూడా గ్రూప్ లోని వారి అభిరుచుల ఆధారంగా రీల్స్‌ను అమర్చి చూపిస్తుంది. రోజు రోజుకు అది అప్డేట్ అవుతుంది.